Ganesh Immersion: గణేష్ ఉత్సవాల్లో 250 మందికి పైగా పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు  హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనం ముగింపు దశకు చేరుకుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతిని ముందుగా నిమజ్జనం చేశామన్నారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం 10,020 విగ్రహాల నిమజ్జనం ఇప్పటివరకు పూర్తి చేశామన్నారు. ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యమైందని చెప్పారు. గతే ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారని అన్నారు. నిమజ్జనాల సందర్భంగా ప్రత్యేకంగా సీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవాలకు వచ్చి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం వంటిచి చేసిన 250 మందిపై కేసులు నమోదు చేశారని వెల్లడించారు. పవిత్రమైన శోభాయాత్రకు కొందరు మద్యం తాగి వచ్చారని, అలాంటి వారిని విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. 


మిలాదునబీ పండుగ సందర్భంగా ముస్లి మత పెద్దలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్టోబర్ 1న పండుగ ర్యాలీ నిర్వహించుకునేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సీపీ, మిలాదునబీ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఖైరతాబాద్ గణేష్  విజయవంతంగా పూర్తి చేసినట్లు సీపీ చెప్పారు. సరిగ్గా 1.30 గంటల సమయంలో ఒక రికార్డు స‌ృష్టిస్తూ ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం ముగిసిందన్నారు. ఇప్పటి వరకూ జియో ట్యాంగింగ్ చేసిన 10,020 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, ఒకటి, రెండు, మూడు అడుగుల విగ్రహాలతో కలుపుకుంటే దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగి ఉంటుందన్నారు. విగ్రహాల ఏర్పాటు సందర్భంగా కొన్ని అపశ్రుతులు జరిగాయని, గత మూడు నాలుగు రోజుల్లో ఐదుగురు చనిపోయినట్లు తెలిసిందన్నారు.  


పోలీసు అధికారులకు అభినందనలు
ఉత్సవాలు  విజయవంతంగా పూర్తి చేయడంలో సిటీ పోలీసులు అధికారులు తీవ్రంగా కష్టపడ్డారని, వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అన్ని విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేశారని అన్నారు. సాధారణ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించామని, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను సడలించినట్లు చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


మహిళ భద్రతకు ప్రాధాన్యత
 ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర సందర్భంగా ప్రత్యేక షీ టీమ్లు 250 మంది పోకిరీలను పట్టుకున్నారని, రద్దీ ప్రదేశాలు, మహిళలు ఎక్కువ మంది వచ్చే ప్రదేశాల్లో షీ టీమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడా నేరాలు జరగకుండా, మహిళ భద్రతకు ప్రధాన్యత ఇస్తూ చైన్ స్నాచింగులు, చోరీలు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి వాటిపై ఎక్కడా ఫిర్యాదులు అందలేదన్నారు. నిమజ్జనం సందర్భంగా చాలా మంది మద్యం సేవించి వచ్చారని, ప్రమాదకరంగా వాహనాలపై డాన్సులు చేస్తూ వచ్చారని, అసభ్య కరమైన పాటలకు డాన్స్‌లు చేశారని అన్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ చుట్టూ కొన్ని విగ్రహాలు నిమజ్జనం కోసం వేచి ఉన్నాయని,  పూర్తవడానికి నాలుగైదు గంటల వరకు పడుతందన్నారు.