CBI another Notice to MLC Kavitha Under 91 CRPC:

  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆదివారం దాదాపు 7 గంటలకు పైగా సీబీఐ అధికారులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితకు మరో నోటీసు పంపినట్లు సమాచారం.  విచారణకు హాజరు కావాలని 91 CRPC  కింద ఎమ్మెల్సీ కవితకి CBI మరో నోటీస్ పంపించింది. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ లేదా డిజిటల్ డివైజ్ ను సీబీఐకి ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయంలో డాక్యుమెంట్ లేదా డివైజ్ లు సీబీఐ కి ఇవ్వాలని 91 CRPC నోటీస్ ఇచ్చింది సీబీఐ. త్వరలో విచారణ జరగనుండగా, తేదీని, ఎక్కడ అనే వివరాలు త్వరలో మెయిల్ చేస్తామన్నారు సీబీఐ అధికారులు. నోటీసులు అందుకున్న వాళ్లు మాత్రమే హాజరు కావాలని, ఆదివారం రోజు హైదరాబాద్ లోని కవిత నివాసానికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు కాకుండా, తాము చెప్పిన చోటుకు వచ్చి విచారణకు హాజరు కావాలని సీబీఐ కవితకు సూచించింది.  


అందుకే కవిత మీడియాతో మాట్లాడలేదా ?
సీబీఐ కి స్టేట్‌మెంట్ ఇచ్చిన అనంతరం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు కవిత. అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు కవిత అభివాదం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, తన అడ్వకేట్‌తో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీబీఐ విచారణ అనంతరం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌తో భేటీ తరువాత కవిత మీడియాతో మాట్లాడారని, లేక స్టేట్‌మెంట్ ఇవ్వాలని భావించారు. కానీ చివరి నిమిషంలో కవిత మీడియాతో మాట్లాడటం లేదని పార్టీ వర్గాలు సమాచారం అందించాయి. సీబీఐ మరో నోటీసు పంపిన కారణంగానే కవిత మీడియాతో మాట్లాడకుండా తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారని తెలుస్తోంది. కానీ ఆదివారం విచారణ ముగిసిన కేవలం గంటల వ్యవధిలోనే సీబీఐ నుంచి కవితకు మరోసారి నోటీసులు రావడం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.


దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. కవితను సీబీఐ అధికారులు ఏడు గంటలు పైగా విచారించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు 7 గంటలు పైగా విచారణ చేసి వివరాలు సేకరించారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి  వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తోంది. 


ఈడీ రిమాండ్ రిపోర్టు ఆధారంగా విచారణ 
ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఆదివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు చేరుకున్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పలు విషయాలను సీబీఐ విచారణ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణ కారణంగా కవిత నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించినట్లు సమాచారం.  అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొన్న విషయాలను సీబీఐ విచారణ సందర్భంగా కవిత వివరణ అడిగినట్లు సమాచారం. ఈ కేసులో సాక్షిగా మాత్రమే కవిత వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.