Hyderabad IRL: హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ తీరాన శనివారం ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) అట్టహాసంగా ముగిసింది. ఈ రేసింగ్ ఈవెంట్‌లో 417.5 పాయింట్లతో కొచ్చి టీం మొదటి స్థానంలో నిలిచింది. 385 పాయింట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 282 పాయింట్లు సాధించి గోవా మూడో స్థానం సాధించింది. చెన్నై నాలుగు, బెంగళూరు ఐదు, దిల్లీ టీమ్ ఆరు స్థానాల్లో నిలిచాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 2.7 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేశారు. మొత్తం 7 ప్రాంతాల్లో ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో పోటీలను వీక్షించేందుకు సందర్శకులు తరలి వచ్చారు. సినీ నటులు రాం చరణ్, నాగ చైతన్య ఇతరు నటీనటులు హుస్సేన్ సాగర్ తీరం వెంట ఏర్పాటు చేసిన ఇండియన్ రేసింగ్ ఈవెంట్ ను వీక్షించారు. 




క్వాలీఫైయింగ్ పోటీలకు బదులుగా రెండు ప్రాక్టీస్ సెషన్స్..


రేసింగ్ ఈవెంట్ లో శనివారం కొంత గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. శనివారం క్వాలి ఫైయింగ్ పోటీలు జరపకుండా రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించారు. నిర్వాహకులు ఆదివారమే అన్ని పోటీలు నిర్వహించారు. రెండు కార్లు రేస్ మధ్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయి. గతంలో మాదిరిగానే మరోసారి రేస్ నిర్వహణ ఆలస్యం అయింది. రేస్ లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మెయిన్ రేస్-1 జరగలేదు. గత నెలలోనూ ఇండియా కార్ రేసింగ్ లీగ్ నిర్వహించ తలపెట్టినప్పటికీ లీగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సమయాభావం కారణంగా పూర్తి స్థాయిలో రేసులు నిర్వహించలేకపోయారు. ఉదయం 9 గంటల నుండి జేకే స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఫార్ములా-4 రేస్ మాత్రమే నిర్వహించారు. సాయంత్రం చీకటి పడటంతో ఎలాంటి రేసులు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. లీగ్ నిర్వహణకు రెండ్రోజులు మాత్రమే ఉండటం.. క్వాలిఫైయింగ్ రౌండ్ లో ఆలస్యం కారణంగా ప్రధాన రేసింగ్ నిలిచి పోయింది. దీంతో ఇండియారేసింగ్ లీగ్ ను రద్దు చేసినట్లు లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. నవంబరు 20 వ తేదీ నాడు నిర్వహించిన రేసింగుల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక మహిళా రేసర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మిగతా నాలుగు ప్రమాదాల్లోనూ రేసర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కొన్ని కార్లు ధ్వంసం అయ్యాయి. 


ఇండియన్ రేసింగ్ లీగ్ అంటే..


మోటార్‌స్పోర్ట్స్‌లో ఫార్ములావన్‌ అత్యున్నత రేసు. చాలామంది డ్రైవర్లు నేరుగా ఫార్ములావన్‌ రేసులో పాల్గొనలేరు. అక్కడికి చేరుకునేందుకు ఎఫ్‌4తో మొదలుపెట్టి.. ఎఫ్‌3లో బరిలో దిగి.. ఎఫ్‌2 స్థాయికి చేరుకుంటారు. ఆ తర్వాతే ఫార్ములా వన్‌లో బరిలో దిగే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఫార్ములా రేసుల్లో పాల్గొనడం అందరికీ సాధ్యం కాదు. అందుకే భారత్‌లో ఉన్న ప్రతిభావంతుల కోసంఐఆర్ ఎల్ (ఇండియన్ రేసింగ్ లీగ్) ఏర్పాటు చేశారు.  అమెరికాలో ఇండికార్‌, జపాన్‌లో సూపర్‌ ఫార్ములా మాదిరిగా మనకంటూ ఇది సొంత రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌. ఆరు జట్లలో స్వదేశీ, విదేశీ డ్రైవర్లు ఉంటారు. ప్రస్తుత సీజన్‌లో 24లో 12 మంది అంతర్జాతీయ రేసింగ్‌ డ్రైవర్లు కాగా.. అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు.