హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిట్లుగా భావిస్తున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 7) తెల్లవారు జామున అతి వేగంగా వచ్చిన కారు షాప్ ల పైకి దూసుకెళ్లడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. తెల్లవారు జామున కావడంతో ఉదయం కాలినడక చేస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్ లో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కారులో ముగ్గురు యువకులు ఉన్నట్లు, వారు మద్యం మత్తులో అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కారులోని వారికి తీవ్ర గాయలు కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుండి పరారైనట్లు ప్రతక్ష సాక్షులు చెపుతున్నారు. కారులోని సీట్ లలో, బయట రక్తపు మరకలు ఎక్కువగా ఉండటంతో లోపలి వారికి గాయాలు ఎక్కువగా అయినట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన యువకులు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియో కూడా బయటకు వచ్చింది. కనురెప్ప పాటులో కారు జారుకుంటూ దూసుకుపోయింది. 180 కిలో మీటర్ల వేగంలో ఉండగా బ్రేకు వేయడంతో కారు రోడ్డుపై జారుకుంటూ వెళ్లిపోయిందని భావిస్తున్నారు.
పెంబర్తిలో ముగ్గురు మృతి
పెంబర్తి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారిపైన ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. కారులోని ఓ చిన్నారికి కూడా ప్రాణాలు కోల్పోయింది. డీసీఎం పంక్చర్ కావడంతో టైరు మారుస్తుండగా ఘటన జరిగింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆరేళ్ల పాప మృతి చెందింది.
హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన మిర్యాల దేవేందర్ రెడ్డి కుటుంబం తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో తిరుపతికి వెళ్లిన వీరు కాజీపేటలో దిగి కారులో హైదరాబాద్ కు వెళుతుండగా నిద్ర మత్తు, పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కార్ డోర్ ఓపెన్ అయి కింద పడి ఆరేళ్ళ పాప శ్రీహిత చనిపోయింది. ఆ కారు మీద పడడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దేవేందర్ రెడ్డి ఆయన భార్య శ్రీవాణికి తీవ్ర గాయాలు అయ్యాయి.