Telangana Haritha Haaram : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యమైనది హరితహారం కార్యక్రమం. రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని, పచ్చదనాన్ని పెంపొందించే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్నిస్తున్నాయి. ఇదే ఇప్పుడు రాష్ట్రానికి మ‌రో ఘ‌న‌త‌ను తెచ్చిపెట్టింది. ప్ర‌పంచ పర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఓ బుక్‌ను విడుద‌ల చేసింది. సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుద‌ల చేసిన‌ తాజా పుస్త‌కంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర‌స్థానంలో నిలిచింది.


తెలంగాణ ప‌చ్చ‌ద‌నంతో నిండాలని, అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్న ఉద్దేశంతో హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. దాని ఫలితంతో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ విడుదల చేసిన బుక్ లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 7,213 పాయింట్ల‌తో తెలంగాణ తొలి స్థానం కైవసం చేసుకోగా, పెరిగిన అడ‌వుల శాతం, మున్సిప‌ల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లోనూ తెలంగాణ మొదటి ర్యాంకులో నిలిచింది. హరితహారం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిందన్నారు. సీఎం కేసీఆర్ విజన్, ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని ట్వీట్ చేశారు. 






7 పాయింట్లు పైగా సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ తరువాత గుజరాత్ 6.593, గోవా 6.394, మహారాష్ట్ర 5.764, హర్యానా 5.578 పాయింట్లతో టాప్ 5లో నిలిచాయి. ఏపీ 5.567 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.