Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు నటుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ అన్నారు. బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ చరిత్రను, హరిహర వీరమల్లు పేరుతో చిత్రంలో చూపెడుతున్నారని విమర్శించారు. పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండుగ సాయన్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మహనీయుడని... ఆయన చరిత్రను కనుమరుగు చేసేందుకే ఇలాంటి సినిమాలు తెరకెక్కిసున్నారని విమర్శించారు. ఆ చిత్ర దర్శక , నిర్మాతలు సినిమా పేరును పండుగ సాయన్న పేరుగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే పండుగ సాయన్న జీవిత చరిత్రను పాఠ్యంశంగా పెట్టి ,  ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం ఏర్పాటు తో , పాలమూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.