Hyderabad 3 new multi level flyovers to come up in IT corridor: హైదరాబాద్‌లో ట్రాపిక్ పరంగా అత్యంత బిజీయెస్ట్ ప్రాంతాల్లో ఒకటి ఐటీ కారిడార్. రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా.. ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. ఓ ఫ్లైఓవర్ కట్టే సరికి దానికి కంటే రెట్టింపు ట్రాఫిక్ రెడీ అవుతోంది. ఇది ఐటీ కంపెనీలకు.. అందులో ఉద్యోగాలు చేసుకునేవారికి సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం భిన్నమైన ఆలోచనలు చేస్తోంది. మూడు ప్రాంతాల్లో మల్టీ లెవల్ ఫ్లైఓవర్స్ నిర్మించాలని నిర్మయించింది. ఇప్పటి వరకూ ఫ్లైఓవర్ అంటే ఒక లెవల్ ఉంటుంది. ఇక నుంచి రెండు, మూడు లెవల్స్ ఫ్లైఓవర్లును నిర్మించనున్నారు. ఇందుకోసం మూడుప్రాంతాలను ఎంపిక చేశారు.
ఖాజాగూడ, విగ్రో, ట్రిపుల్ ఐటీ జంక్షన్లలో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది.అందుకే ఈ మూడు ప్రాంతాల్లో మల్టిలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమయింది. ఇందు కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించారు. వీటిలో ఒక్క ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టిలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం క్లిష్టమైనది. ఈ ఒక్క నిర్మాణం కోసమే 459 కోట్ల రూపాయలను కేటాయించారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకూ రోడ్డును విస్తరించే ప్రణాళికలు కూడా సిద్దమయ్యాయి.
Also Read: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రస్తుతం ఐటి కారిడార్‌లో ఆఫీసులు ప్రారంభమయ్యే సమయంలో , ముగిసే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనే ప్రతి ఒక్కరికి అరగంట నుంచి గంట సమయం వృధా అవుతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు వస్తూండటంతో హెచ్‌ఎండీఏ ఐటీ కారిడార్‌లోని ట్రాపిక్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. హెచ్ సిటీ ప్రాజెక్టు కింద ప్రస్తుతం పదిహేను కిలోమీటర్లు ఉన్న సగటు ప్రయాణ వేగాన్ని కనీసం 35 కిలోమీటర్ల వేగానికి పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ఇంధన వృధా తగ్గుతుదంని ఎంతో మంది సమయం ఆదాఅవుతుందని అంచనా వేశారు.