హైదరాబాద్‌ శివారులో హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ఈ - వేలాల్లో భూముల ధరలు ఊహించని ధరలు పలుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చోట ఈ - వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ సోమవారం (ఆగస్టు 14) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొకిలా వద్ద సుమారు 300 పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 300 ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ లేఔట్‌లో 300 నుంచి 500 గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది. 


నేటి (ఆగస్టు 14) నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. రూ.1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD (Earnest Money Deposit) రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో చదరవు గజానికి రూ.25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు. మొకిలా ఫేస్ - 1లో గజానికి అత్యధిక ధర రూ.1.05 లక్షలు కాగా, అత్యల్పంగా రూ.72 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫేజ్ - 1లో ప్రభుత్వానికి యావరేజ్ గా ఒక్కో  గజంపై రూ.80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు గానూ సుమారు రూ.800 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.