HMDA New Layouts: హైదరాబాద్ నగరంలో కొత్త లేవుట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority - హెచ్ఎండీఏ) అభివృద్ధి చేస్తోంది. వీటిని ఆధునిక మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రెండు లే అవుట్లు భారీ లే అవుట్లు కావడం విశేషం. హైదరాబాద్‌కు ఉత్తరాన బాచుపల్లిలో ఒకటి, తూర్పు వైపున పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి సమీపంలో ఒకటి, మొత్తం లే అవుట్లు అభివృద్ధి అవుతున్నాయి. వీటిని ఆన్ లైన్‌లో అమ్మేందుకు రెడీ చేస్తున్నారు.
వరంగల్ నేషనల్ హైవేకి అర కిలో మీటరు దూరంలో మేడిపల్లి రెవెన్యూ పరిధిలో 55 ఎకరాల స్థలంలో ఒక లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇంకోటి మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి గండి మైసమ్మ వైపు వెళ్లే మార్గంలో బాచుపల్లి ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ రెండు లే అవుట్లు ఔటర్ రింగు రోడ్డుకు లోపల ఉండనున్నాయి. అత్యంత కీలకమైన ప్రాంతాలైన బాచుపల్లి, మేడిపల్లిలో విశాలమైన స్థలాల్లో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇవి నివాస ప్రాంతాలకు చాలా అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా లే అవుట్‌ను రూపొందించారు.
HMDA Plots Auction: వీటిని ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఇటీవల నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మార్చి 2, 3 తేదీల్లో బాచుపల్లి లేవుట్‌ను, మార్చిన 6వ తేదీన మేడిపల్లిలోని ప్లాట్లకు వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు వేలం నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ నుంచి మొదలు కొని అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, నిర్ణయించిన తేదీల్లో ఆయా సైట్ల వద్ద ప్రీ బిడ్ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లు
GHMC ఇప్పటికే ఉన్న తొమ్మిది హాళ్లకు తోడు మరో 16 కొత్త ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తోంది. ఈ హాల్స్‌లో వివాహాలు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఖరీదైన బాంక్వెట్ హాల్స్, ఫంక్షన్ హాళ్లలో ఉండే సౌకర్యాలతో సమానంగా వీటిలో ఉండనున్నాయి. ప్రతి GHMC మల్టీ పర్పస్ హాల్‌లో వధూవరులకు ప్రత్యేక గదులు, కల్యాణ మండపం, భోజన ప్రాంతం, మాడ్రన్ కిచెన్, తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యాలు లాంటివి ఎన్నో ఉన్నాయి.
హాల్స్‌లో ఫాల్ సీలింగ్‌లు, విట్రిఫైడ్ టైల్స్, ఇతర సొగసైన టచ్‌లు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ అద్దె అనేది అది ఉన్న ఏరియాపైన ఆధారపడి ఉంటుంది. అయితే హైదరాబాద్‌లోని బాంకెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2 వేల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న హాల్స్ ధర రూ.10 వేలుగా ఉండగా, 2 వేల నుంచి నాలుగు వేలు, 4 వేల చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న వాటి ధర వరుసగా రూ.15 వేలు, రూ.20 వేలుగా సుమారుగా ఉంటుంది.