Three new members in Telangana cabinet : హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గంలో ముగ్గురు నేతలకు అవకాశం కల్పించారు. వివేక్ వెంకట స్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లను మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ అధిష్టానం అన్ని సామాజిక సమీకరణాలు పరిశీలించి, నేతల నుంచి అభిప్రాయాలు.. రాష్ట్ర ఇంఛార్జ్ అభిప్రాయం సేకరించి ఈ ముగ్గురికి మంత్రి పదవి ఖరారు చేశారు. వీరితో పాటు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్న వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌లతో పాటు డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకే రాజ్‌భవన్‌కు కొత్త మంత్రుల జాబితాను ప్రభుత్వం సమర్పించింది.
ఈసారి మంత్రివర్గంలో తమకు అవకాశం కచ్చితంగా లభిస్తుందనుకున్న పలువురు సీనియర్ నేతలకు నిరాశే ఎదురైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లాంటి పలువురు నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు. పార్టీకి ఎంతో సేవ చేశామని, మంత్రిగా అవకాశం కల్పించాలని తాము పార్టీకి చేసిన సేవలను సైతం గుర్తుచేసినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ కేబినెట్ విస్తరణలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు.
ఏడాదిన్నర తరువాత కేబినెట్ విస్తరణ
2023 డిసెంబర్ నెలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అది మొదలుకుని గత 18 నెలల నుంచి పలుమార్లు రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చర్చ జరిగేది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న పలుమార్లు తెలంగాణ కేబినెట్ విస్తరణ అని, మరో ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు అని ప్రచారం జరిగేది. అదే సమయంలో ఇటు నేతలు సైతం తమకు మంత్రి పదవి ఇవ్వాలని, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం తమ సేవలు గుర్తించాలని రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ లాంటి వారు కోరేవారు.
మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలిసిందే.
మంత్రి పదవి ఆశించిన ఎంతో మంది నేతలకు నిరాశే ఎదురైంది. దాంతో వారిని బుజ్జగించే బాధ్యత రాష్ట్ర మంత్రులపై పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనకుండా తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.