Heavy rains are falling in Hyderabad once again: హైదరాబాద్‌ను వర్షం వెంటాడుతోంది. బుధవారం కురిసిన వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం కూడా అదే తరహా వర్షాలు పడుతున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఎల్.బి. నగర్, ఉప్పల్, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల సమీప ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రజలు ఇంటిలోనే ఉండి, అత్యవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు సూచించారు.
IMD హైదరాబాద్ జారీ చేసిన యెల్లో అలర్ట్ ప్రకారం, సెప్టెంబర్ 18-19 తేదీల్లో తెలంగాణా అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో 50 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా. ఖైరతాబాద్, ఎంఎస్ మక్తా, ముషీరాబాద్, సికిందరాబాద్ వంటి ప్రాంతాలు భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సికిందరాబాద్‌లోని నాలుగు లొకాలిటీల్లో 147.5 మి.మీ. నుంచి 184.5 మి.మీ. వర్షపాతం నమోదైంది, ఇది IMD ప్రమాణాల ప్రకారం "అతి భారీ వర్షం" కేటగిరీలోకి వస్తుంది.
అల్వాల్, మల్కాజ్‌గిరి, సికిందరాబాద్, కాప్రా, ఈసీఐఎల్, నేరడ్మెట్, మౌలా అలీ, నగరం, మల్లాపూర్‌లలో తీవ్రమైన ఉరుములు మరియు భారీ వర్షాలు కొనసాగుతాయని.. మిగిలిన నగరంలో స్థిరమైన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మ, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వాటర్‌లాగింగ్ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగాయి. డ్రైనేజీ వ్యవస్థలను క్లియర్ చేయడం, ట్రాఫిక్ నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేసి, ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.