Telangana Heavy Rains : తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల‌్లో వరద విలయతాండవం చేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  కుండపోతగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్‌ జిల్లాను షేక్ చేశాయి. సిద్ధిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారంలో రికార్డు స్థాయిలో 23.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షానికి గౌరారంలో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్గల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో చెరువులు పొంగి పొరడడంతో వర్షం నీరు రహదారులపైకి చేరింది. దీని వల్ల రాకపోకలకు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి.

కొట్టకుపోయిన రహాదారులు.. 200 ఎకరాల్లో పంట నష్టం

వాగుల ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్‌ శివారులోని హల్దీ వాగు ఉప్పొంగుతోంది. శివ్వంపేట మండలం పాంబండ వద్ద నిర్మించిన రహదారి కొట్టుకుపోయింది. హల్దీ ప్రాజెక్టు ఉద్ధృతికి కొప్పులపల్లి-హకీంపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలోని మోతుకులకుంట నిండిపోయింది. ఆ నీరు ఊరిపైకి వస్తుందని గ్రహించిన అధికారులు ఓవైపు గండికొట్టి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. శివ్వంపేట, నరసాపురం మండలంలో చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అల్లాదుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగింది. ఈ దెబ్బకు దాదాపు 200 ఎకరాల్లో పంట నీట మునిగింది. మెదక్‌ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో కట్టు కాల్వ తెగిగ్రామం నుంచి వర్షపునీరు ప్రవహించింది. తూప్రాన్‌లో పలు కాలనీలు జలమయం అయ్యాయి.

కట్టలు తెంచుకున్న చెరువులు..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వాసర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకు పోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మేడ్చల్ నుంచి గౌడవెళ్లి రోడ్డుపై వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మాపూర్ అలుగు పారి ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు చెక్‌పోస్టులు పెట్టారు.

నారాయణపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకి, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండారెడ్డిపల్లి చెరువు కట్టలు తలంచుకుని ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రంలోని వాగు ఉద్ధృతికి ఊట్కూరు మండలంలోని అమీన్ పూర్, పగిడిమారి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మంగపేటలోని రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మంచిర్యాలలో కురుస్తున్న కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..!

జోరువానలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి.  వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయిలో వర్షాలు కుమ్ముతున్నాయి.  జోరువానలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి సింగరేణి డివిజన్‌లోని కొన్ని ఉపరితల గనుల్లో బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది.  ఏటూరునాగారం-కమలాపూరం మధ్య జీడివాగు ఉద్ధృతి పెరిగింది. పలు చోట్ల ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలకు తాడ్వాయిలో మహిళ మృతి చెందింది. వరద బాధిత ప్రాంతాలతో పాటు మేడారంలో జంపన్నవాగు, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉద్ధృతిని భయాందోళన కలిగిస్తోంది.