Telangana Sabha: తెలంగాణలో అసెంబ్లీ (Assembly)సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధించుకోగా...బడ్జెట్ సమావేశాల్లో  మరింత వాడీగా దాడులు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇరుపక్షాలు దూకుడు పెంచాయి.


ఆరు గ్యారెంటీల అమలుపై పట్టు
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్(Congress)...వాటి అమలుపై కనీసం దృష్టి సారించలేదని బీఆర్ఎస్(BRS) విమర్శించింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiam Srihari) ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఆరు గ్యారెంటీలతోపాటు కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు అమలు చేయాలంటే లక్షా 36వేల కోట్లు కావాలని....కానీ కాంగ్రెస్ అందులో సగం కూడా బడ్జెట్ లో కేటాయించలేదని మండిపడ్డారు. కేవలం 53వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుండా  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదని....అప్పుడే ఎదురుదాడులు, ఉద్యమాలు  ప్రారంభిస్తే ఎలా  అంటూ చురకలు వేశారు. ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న శ్రీధర్ బాబు...పథకాలు అమలు చేసేందుక క్షేత్రస్థాయిలో కసరత్తు జరుగుతోందన్నారు. ఇప్పటికే రెండు హామీలు దిగ్విజయంగా అమలు చేశామని గుర్తుచేశారు, మరో రెండు హామీలు  త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. కనీసం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా  హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించిందని కడియం శ్రీహరి విమర్శించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిపై భస్మాసుర హస్తం పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కడియం వర్సెస్ పొన్నం
బడ్జెట్ పై చర్చ సందర్భంగా  బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ  కాంగ్రెస్ పదేపదే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని గొప్పలు చెబుతున్నారని...ఇందిరమ్మ రాజ్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎమర్జెన్సీ(Emergency)నే అన్నారు. వెంటనే దీన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), శ్రీధర్ బాబు అడ్డుకున్నారు. స్వాతంత్ర్యం ఏర్పడినప్పుడు  కనీసం భారత్ లో సూది తయారు చేసే పరిశ్రమలు కూడా లేవని....కానీ నేడు విమానాలు, రాకెట్లు తయారు చేసుకోగలిగే స్థితికి చేరామంటే కాంగ్రెస్ పుణ్యమేనని మండిపడ్డారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా  కేవలం తెలంగాణ బడ్జెట్ పైనే మాట్లాడాలని...అంతేకానీ దేశ రాజకీయాలు, గడిచిపోయిన కాలం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ చర్చ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ...బడ్జెట్ లెక్కల్లో మాత్రం గత ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉందని...కానీ బయట మాత్రం తిడుతున్నారని శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వ పాలన సరిగ్గా లేకపోతే  తెలంగాణ తలసరి ఆదాయం ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.  తెలంగాణ(Telangana)లో అభివృద్ధే జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే రూ.2.75 లక్షలు ఎలా పెడతారన్నారు. బడ్జెట్ సమావేశాలను  ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడిన కడియం...బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి గానీ, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కానీ సభలో లేరన్నారు.