Double Decker Flyover on NH65: హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది. ఎల్‌బీనగర్‌ LB Nagar నుంచి హయత్‌నగర్‌ Hayath Nagar వరకూ 5.5 కిలోమీటర్ల మేర 8వరుసలతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.650 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా...! ఈ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగ్‌పూర్‌లో నిర్మించిన  డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ నమూనాలోనే ఇక్కడ కూడా నిర్మించాలని భావిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ వద్ద ట్రాఫిక్ పరిస్థితిని ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో సమీక్షించారు. 

ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే..విజయవాడ- హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఏ స్థాయిలో రద్దీ ఉంటుందో అందరికీ అనుభవమే. ఎల్బీనగర్‌ దగ్గర అవుటర్ వరకూ రోడ్డు విపరీతంగా రద్దీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆ రోడ్లను వెడల్పు చేసినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. జాతీయ రహదారిపై నుంచి వచ్చే వాహనాలకు లోకల్ ట్రాఫిక్‌ కలవడంతో చాలా ఎక్కువ రద్దీగా ఉంటోంది. అందుకే వాహనాలు నేరుగా ఎల్బీనగర్‌కు చేరుకునేలా..ఇటు నుంచి కకూడ అంతరాయం లేకుండా వెళ్లేలా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని అనుకుంటున్నారు 

మెట్రో మార్గానికి అనుగునంగా..

విస్తరణలో భాగంగా ప్రస్తతం ఉన్న మెట్రో లైన్‌ను హయత్‌నగర్ వరకూ విస్తరించాలని ఇంతకు ముందే నిర్ణయించారు. ఇప్పుడు చేపట్టబోయే నిర్మాణం దానిని కూడా దృష్టిలో ఉంచుకుని చేయనున్నారు. ఇందులో కింద సర్వీసు రోడ్డు ఉంటుంది. మధ్యలో 8వరుసల ఫ్లైఓవర్.. దానిపైన మెట్రో మార్గం ఉంటుంది. ఇలా డబల్ డెక్కర్ రోడ్డును 5.5 కిలోమీటర్ల వరకూ నిర్మిస్తారు. ప్రస్తుతం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ జరుగుతోంది. నగరానికి వెలుపల కొన్ని చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టారు. చౌటప్పల్ దగ్గర ఉన్న  మల్కాపూర్ నుంచి ఎల్బీనగర్‌ వరకూ ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో దానిని విస్తరించడానికి 541కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ORR లోపల పెద్ద అంబర్‌పేట్ వరకూ రోడ్డు విస్తరణ పూర్తైంది. ఆ తర్వాత కూడా రోడ్డు వెడల్పు బాగానే ఉన్నప్పటికీ నగరంలోని ట్రాఫిక్‌ హైవేపైకి వచ్చి ఇబ్బంది అవుతోంది. సిటీ మధ్యలో ఉండటంతో రోడ్డును డివైడర్‌తో క్లోజ్ చేయడం ఇబ్బంది అవుతోంది. చాలా చోట్ల పాసింగ్ కోసం రోడ్డును ఓపెన్ చేయాల్సి వస్తోంది. అందుకే పెద్ద అంబర్‌పేట్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ ఎలాంటి అంతరాయం లేకుండా ఎలివేటెడ్ మార్గం వేయాలని అనుకుంటున్నారు. మెట్రో కోసం ఎలాగూ ఎలివేటెడ్ మార్గాన్ని వేయాలి కాబట్టి రెండింటికీ కలిసొచ్చేలా దీనిని ప్రతిపాదించారు. 

రెండు గంటల్లో విజయవాడ-హైదరాబాద్

ఈ మార్గాన్ని ఏడాది లోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనిపై 6వతేదీన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలుస్తున్నామని చెప్పారు.విజయవాడ హైదరాబాద్‌ మధ్య పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కేంద్రం ఓకే చెప్పింది. ఏపీ కొత్తరాజధాని అమరావతి నుంచి.. ఫ్యూచర్‌ సిటీ దగ్గర ORRకు కలిసేలా దీనిని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా  హైదరాబాద్‌- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే కావాలని  రెండు రోజుల కిందట విజయవాడ వచ్చిన గడ్కరీని కోరారు. ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. యాక్సెస్ కంట్రోల్డ్.. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు గంటల్లోనే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చని కోమటిరెడ్డి అంటున్నారు.