Kaleshwaram Lift Irrigation Scheme project | హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అందుకు మాజీ సీఎం కేసీఆర్ జవాబుదారు అని ప్రాజెక్టు మీద నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లను విచారించిన ఘోష్ కమిషన్ దాదాపు 700 పేజీల నివేదికను కొన్ని రోజులకిందట ప్రభుత్వానికి సమర్పించింది. ఈ  నివేదికను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్, నిర్వహణ, ఆపరేషన్ సహా అందులో జరిగిన అవకతవకలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా జవాబుదారీ అని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వెల్లడైనట్లు ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Continues below advertisement


ప్రభుత్వ నిర్ణయాలు కాదు.. వ్యక్తిగత నిర్ణయాల వల్లే లోపాలు


ఉన్నత స్థాయి వర్గాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా చేపట్టారని నివేదికలో ఉంది. అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లు సైతం దీనికి బాధ్యులు అని కాళేశ్వరం కమిషన్ నివేదించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు, వారికి తప్పుడు నివేదనలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల ఇంజనీర్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా తమ నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావు, కేంద్ర జల కమిషన్‌కు వాస్తవాలకు బదులుగా, అసత్యాలను తెలిపారని కమిషన్ నివేదిక పేర్కొన్నట్లు అధికారుల కమిటీ తెలిపింది.


కేబినెట్ భేటీలో కమిషన్ నివేదికపై కీలక చర్చ..
నేటి (ఆగస్టు 4న) మధ్యాహ్నం నిర్వహించే తెలంగాణ కేబినెట్ భేటీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై సమగ్రంగా చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచేందుకు ప్రభుత్వం ఇదివరకే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులో రాజకీయ ప్రభావం, వ్యక్తిగత నిర్ణయాలు ప్రభావం చూపడంతో అనేక లోపాలు జరిగాయని కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు కమిటీలోని అధికారులు, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, జీఏడీ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతితో ప్రత్యేకంగా భేటీ అయ్యి పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికలోని అంశాలపై చర్చించారు.


మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు అదే కారణం..
అటు రాజకీయంగా వ్యక్తిగత నిర్ణయాలు, ఇటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జాధనం దుర్వినియోగమైందని కమిషన్ పేర్కొనట్లు సమాచారం. బ్యారేజీలను నీటి నిల్వ వ్యవస్థలుగా కాకుండా తక్కువ హెడ్ డైవర్షన్ నిర్మాణాలుగా రూపొందించారు, కానీ పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్టింగ్ కోసం బ్యారేజీలలో నీటిని పూర్తి సామర్థ్యం వరకు నిరంతరం నింపాలని కేసీఆర్ ఆదేశించారని విచారణ కమిషన్ గుర్తించింది. అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని అభిప్రాయపడింది. 


పెరిగిన ఖర్చు.. ప్రజా ధనం వృథా..
అప్పటి కేబినెట్ అనుమతి లేకున్నా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చేశారు. అంచనాల సవరింపులో అవకతవకలు, నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టడం, డిజైన్లలో లోపాలు, నాణ్యతా పరమైన తనిఖీలు లేకపోవడం లాంటి అనేక అంశాలను కమిషన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిధులు విడుదల చేయడాన్ని కమిషన్ తప్పుపట్టింది.  


అప్పటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రాజెక్టును పర్యవేక్షించిన సీఎంవో కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సభర్వాల్‌తో పాటు మాజీ ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, మాజీ సీఈలు బసవరాజు, చంద్రశేఖర్.. ఈఎన్సీలు టి.శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్‌రెడ్డి, ప్రమీల తదితరుల పాత్ర గురించి కాళేశ్వరం కమిషన్ తమ నివేదికలో ప్రస్తావించింది. డీపీఆర్‌ తయారీకి కన్సల్టెన్సీ కింద వాప్కోస్‌ సంస్థకు ఇచ్చిన రూ.6.77 కోట్లను తిరిగి వసూలు చేయాలని సైతం పీసీ ఘోష్ కమిషన్‌ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై నేటి సాయంత్రం అధికారిక ప్రకటనగానీ, చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.