Telangana Politics: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కు బదులు హరీశ్ రావు హాజరయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...శాసనసభా వ్యవహారాల మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు. అయితే బీఏసీ సమావేశానికి హరీశ్ రావు రావడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కేసీఆర్ కు బదులు హరీశ్ రావు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ రావు సమావేశంలో పాల్గొనకుండానే బయటకు వచ్చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తామని, అయితే అది పేలవంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ మిగిలిందన్న ఆయన...వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు...గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించిందన్నారు. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశే మిగిలిందన్న ఆయన...ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేదన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని...మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదని హరీశ్ రావు విమర్శించారు.
నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదన్న ఆయన...ప్రజా వాణి తుస్సుమందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారని చెప్పారని...మంత్రులు, ఐఎఎస్ లు కూడా లేరని... చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ చేత చెప్పించారన్న హరీశ్ రావు...ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 ఉన్నాయని... రెండు అమలు చేసి మొత్తం చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు.
10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంచడంలో లోపం ఉందన్న హరీశ్ రావు.. ఈ కారణం చేతనే ఆ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదన్నారు. డిసెంబర్ 9 నాడు ప్రమాణం చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని...ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముందు చేసి, ప్రజల హామీ మాత్రం వాయిదా వేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించిన హరీశ్ రావు....వంద రోజుల్లో 60 రోజులు పూర్తి అయ్యాయని...40 రోజులే ఉన్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేదన్న ఆయన.. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు.
గవర్నర్ ప్రసంగం అంటే ఏడాదికి విజన్ డాక్యుమెంట్ లాంటిదని...500 రూపాయలకే గ్యాస్, కరెంట్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నారని...వీటి గురించి మాత్రమే చెప్పారని తెలిపారు. అంటే మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేమని చెప్పకనే చెప్పారన్న మాజీ మంత్రి... వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులు ఎత్తేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల కాలంలో రైతులకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారన్న హరీశ్ రావు, వచ్చే యాసంగి పంటకు అయినా బోనస్ ఇస్తారని అనుకుంటే...నిరాశే ఎదురైందన్నారు.