తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) చర్చకు రావాలన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు భగ్గుమన్నారు. అమరవీరుల స్థూపం వద్ద చర్చిద్దామని కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసలు అమరవీరుల స్థూపాన్ని హక్కు కిషన్‌ రెడ్డికి లేదని ఘాటుగా విమర్శించారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి కిషన్‌రెడ్డి అంటూ దుయ్యబట్టారు. 


2010లో తన సహచర ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ రాజీనామా చేసినా కిషన్ రెడ్డి(Kishan Reddy) అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు హరీష్‌రావు. యెండల లక్ష్మీనారాయణను గెలిపించుకోవడం కిషన్ రెడ్డికి చేతకాక పోతే తెలంగాణ ఇజ్జత్ కోసం కెసీఆర్ ఆయన్ని గెలిపించారని విమర్శించారు. కిషన్‌రెడ్డి స్థాయి సీఎం కేసీఆర్‌ స్థాయి కాదని.. ఆయనతో చర్చించడానికి ఎమ్మెల్యేలు చాలన్నారు హరీష్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేదా అని ప్రశ్నించారు. 


కేసీఆర్ భాషపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని... ఆయనది తెలంగాణ భాషని, బీజేపీది మత విధ్వేషాల భాషని మండిపడ్డారు హరీష్‌రావు(Harish Rao). కేసీఆర్ భాష ఎప్పటికీ ఒకే లాగా ఉంటుందన్నారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌షా పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును బ్లాక్ డేగా అభివర్ణిస్తే కిషన్ రెడ్డి బల్లలు చరిచారని గుర్తు చేశారు. 


కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తీసుకొచ్చారో చెప్పాలన్నారు హరీష్‌రావు. తెలంగాణ(Telangana)కు అన్యాయం జరుగుతుంటే ప్రధాని మోడీని ఎపుడైనా కిషన్ రెడ్డి ఆడిగారా అని నిలదీశారు. తెలంగాణకు కిషన్ రెడ్డి గుండు సున్నాగా మిగిలారని ఎద్దేవా చేశారు. టూరిజం మంత్రిగా సమ్మక్క సారాలమ్మ జాతర(Sammakka Saralamma Jatara)కు రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి కిషన్ రెడ్డి జబ్బలు చరచుకుంటున్నారని.. రాష్ట్రం 364 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కనీసం రాష్ట్ర పండగగా కూడా సమ్మక్క సారాలమ్మ జాతరను గుర్తించరా అని ప్రశ్నించారు. ఒక్కటైనా జాతీయ ప్రాజెక్టు తెలంగాణ కు తెచ్చారా అని నిలదీశారు. ఒక్క ప్రాజెక్టు తెచ్చినా కిషన్ రెడ్డికి దండ వేస్తామని సవాల్ చేశారు. 


నదుల అనుసంధానంపై మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డేనా అని అనుమానం వ్యక్తం చేశారు హరీష్‌ రావు. రాష్ట్ర ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వకుండా వేరే రాష్ట్రాల నీటి ప్రయోజనాల కోసం మాట్లాడటమేంటని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం... కాళేశ్వరం(Kaleswaram), పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు సంగతేంటన్నారు. కిషన్‌ రెడ్డి జాతీయ హోదా ఎందుకు తీసుకు రారని క్వశ్చన్ చేశారు. 


 ఎవరైనా అభివృద్ధిపై మాట్లాడితే చాలు పాకిస్థాన్‌ పాచిక వేస్తారని ఇక్కడ అలాంటివి పని చేయవని  అభిప్రాయపడ్డారు హరీష్‌రావు. ఆ పాచిక పాచి పోయిందని సెటైర్లు వేశారు. పాకిస్థాన్ వెళ్లి ఎవరి బిర్యానీ తిన్నారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు కిషన్ రెడ్డి తీసుకొస్తే మంచిదని.. ఇలా బుకాయించడం పద్దతి కాదని హితవు పలికారు. మిషన్ భగీరథను కేంద్రమే మెచ్చుకుందని గుర్తు చేసిన హరీష్‌ రావు.. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో అంబర్‌పేట చౌరస్తాలో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. 


బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి ఆత్మ వంచన చేసుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి ఇతర మంత్రులు, టీఆర్‌ఎస్‌ లీడర్లు. వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ నాయకులపై విరుచుపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక సతమత వుతున్నారని ఎద్దేవా చేశారు. కిషన్  రెడ్డి రాష్ట్రానికి బియ్యం ఇచ్చాం, నీళ్లు ఇచ్చాం అని ఏదో బిచ్చం వేసినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి తప్ప కేంద్రం నయా పైసా అదనంగా ఇచ్చింది లేదని తేల్చి చెప్పారు. గతంలో అమిత్‌షా(Amit Sha)ను ఇదే విషయం అడిగితే తోక ముడిచారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి నలుగురు ఉన్నా చేసింది సున్నా అంటూ లెక్కలతో వివరించారు మంత్రులు. విద్యుత్ సంస్కరణల అంశంపై కేసీఆర్‌ను దూషిస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


విద్యుత్ పాలసీని దొడ్డి దారిన రాష్ట్రాలపై రుద్దాలని కేంద్రం చూస్తోందన్నారు జగదీష్‌ రెడ్డి(Jagadish Reddy). పార్లమెంట్‌లో బిల్లు తీసుకురాకుండానే అమలు పరిచేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని దుమ్మెత్తి పోశారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు. కేసీఆర్ నిప్పు అని బీజేపీ నేతలు ఆయన్ని ముట్టుకుంటే మసై పోతారని హెచ్చరించారు. కేసీఆర్‌పై ఆరోపణలకు ఓ చిన్న ఆధారం కూడా బీజేపీ నేతలు చూప లేకపోయారన్నారు.