హైదరాబాద్‌లో గ్రూప్‌  2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి మృతి అర్థరాత్రి కలకలం రేగింది. పరీక్ష వాయిదా పడటం వల్లే ఆమె మృతి చెందిందని గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమని భీష్మించారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. 


చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఓ హాస్టల్‌లో ఉంటూ కాంపిటేషన్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 


గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనితోటి అభ్యర్థులు, అక్కడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. స్థానికులు, హాస్టల్‌ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. భారీగా చేరుకున్న అభ్యర్థులు పోలీసులు ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


అభ్యర్థులు అడ్డుకోవడంతో అర్థరాత్రి వరకు హాస్టల్‌లోనే మృతదేహం ఉండిపోయింది. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్, బండారు విజయలక్ష్మి నిరసనల్లో పాల్గొన్నారు. 


రాత్రి రెండు గంటల వరకు ఈ హైడ్రామా కొనసాగింది. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రూప్స్ అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆమెకు న్యాయం చేసే వరకు అక్కడే ఉంటామని భీష్మించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకారులతో పోలీసులు మాట్లాడుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు.


పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టారు. ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇలా టెన్షన్  వాతావరణంలోనే ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  


ప్రవళిక పేరు మీద ఓ సూసైడ్ నోట్‌ సోషల్ మీడియాలో తిరుగుతోంది. అమ్మా నన్ను క్షమించండీ అంటూ మొదలు పెట్టిన లేఖలో చాలా అంశాలు ప్రస్తావించింది. తాను నష్టజాతకురాలిని అని తన వల్ల పేరెంట్స్‌కు ెప్పుడూ బాధలే అని చెప్పుకొచ్చింది. మీకు నేను చాలా అన్యాయం చేశానని ఎవరూ ఏడవొద్దని చెప్పిన ప్రవళిక..తన కాలు కిందపెట్టకుండా చూసుకున్న అమ్మకు ధన్యవాదాలు చెప్పింది. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నాననని క్షమించాలని కోరుతూ లేఖ ముగించింది. 


ఉదయాన్నే ప్రవళిక బంధువులు హైదరాబాద్ వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని చూసిన తల్లి కుప్పకూలిపోయారు. మెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని తలెత్తుకొని వస్తుందని అనుకుంటే ఇలా విగత జీవిగా పడి ఉండటం చూసి బంధువులు కూడా తట్టుకోలేకపోయారు.