Governor Tamilisai Comments: ప్రభుత్వం తనను గౌరవించడం లేదని తనకు ఎలాంటి సమస్యా లేదని, కానీ ప్రజలు ప్రభావితం అవుతున్నందున వారి సమస్యలను మాత్రం పట్టించుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. వ్యక్తిగతంగా తనకు గౌరవం లేకపోయినా పర్వాలేదని, కానీ రాజ్ భవన్ కు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరి బాధ్యత వారు కచ్చితంగా నిర్వర్తించాలని అన్నారు. ఒక ప్రభుత్వం రాజ్ భవన్ నే గౌరవించకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. ప్రజా సమస్యలకు ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తున్నామని తన బాధ అంతా మహిళల గురించే అని అన్నారు. ప్రభుత్వం బాధ్యత లేనట్లుగా ఉంటోందని విమర్శించారు. 


శుక్రవారం గవర్నర్ తమిళిసై తెలంగాణ రాజ్ భవన్ లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు తమ సమస్యలను గవర్నర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం తమిళిసై మీడియా సమావేశం నిర్వహించారు.


వారి బాధ చూస్తే నా గుండె పగులుతోంది
‘‘నేను వివాదాస్పద వ్యక్తిని కాను. తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి చేయాలని ఉంది. నేను డాక్టర్ ను. ఆ కోణంలో ప్రజల సమస్యలు ఏంటో ఒక మహిళగా నేను అర్థం చేసుకోగలను. నా వంతుగా నేను సాయపడాలనుకుంటున్నాను. నాకు నేనే సేవా కార్యక్రమాలు చేస్తుంటే తనపై వ్యతిరేకత ఎందుకు? మైనర్ అమ్మాయిలు, బాధితులు, మహిళలను చూస్తే నా గుండె పగులుతోంది. వారికి నా వంతు సహకారం అందిస్తా. ఈ క్రమంలో వచ్చే నిరసన కారులను నేను పట్టించుకోను’’


ప్రభుత్వ శాఖల నుంచి సహకారం లేదు - గవర్నర్
‘‘నాకు ప్రభుత్వ శాఖలు ఏమీ సాయం చేయవు. రెడ్ క్రాస్, డాక్టర్లు, లాయర్లు, ఎన్జీవో సంస్థలు నాకు సాయం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను చేసే కార్యక్రమాలకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. మేం తలపెట్టే ప్రతి పనికి మాకు సాయం చేసేందుకు సంబంధిత నిపుణులు ఉన్నారు.’’


ప్రభుత్వ శాఖలు కాస్త పట్టించుకోండి - గవర్నర్
‘‘ప్రభుత్వ శాఖలకు నా విన్నపం ఏంటంటే.. మహిళా దర్బార్ ద్వారా మేం స్వీకరించిన ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి వారికి తగిన న్యాయం చేయండి. దయచేసి రాజ్ భవన్ నుంచి వచ్చే ప్రజల ఫిర్యాదులను పట్టించుకొని వారికి న్యాయం చేయండి’’ అని గవర్నర్ తమిళిసై అభ్యర్థించారు.