హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తమ కూతురిపై అత్యాచారం జరిగిందని మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్ సలీమ్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రజాసంఘాలతోపాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవు అయిందని, మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల్ని బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు.


ప్రస్తుతం బాధిత బాలికను వనస్థలిపురం ప్రభుత్వ హస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆ బాలికను వనస్థలిపురం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తెలంగాణలో సీసీటీవీ కెమెరాలు, షీటీమ్స్ ఎన్ని ఉన్నా కానీ మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈటల ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు పలికే అసమర్థ సీఎం వెంటనే రాజీనామా చేయాలని .మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులను సీబీఐతో దర్యాప్తు చేయాలని ఈటల అన్నారు.


పక్క ఇంట్లో ఉంటున్న సలీమ్ అనే వ్యక్తి (ఆటో డ్రైవర్) తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలికపై మూడు రోజులుగా అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు వాపోయారు. రోజు మైనర్ బాలికతో షాప్ కి వెళ్లి రా అంటూ బెదిరించి ఇంటికి పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశాడని అన్నారు. పక్కింటి మహిళకు అనుమానం రావడంతో విషయాన్ని మైనర్ బాలిక తల్లికి తెలపడంతో బాలికను తల్లి ప్రశ్నించింది. దీంతో ఈ అఘాయిత్యం గురించి బాలిక తల్లికి వివరించింది. వెంటనే బాలిక తల్లి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.