At Home: రాష్ట్ర, దేశ వ్యాప్తంగా జెండా పండుగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగుర  వేశారు. తర్వాత ప్రభుత్వం చేసిన, త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అంతకుముందు ప్రగతి భవన్ లో జెండా వందనం చేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. దానికి మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాయంత్రం 6.55 గంటలకు సీఎం వస్తారని ఆయన కార్యాలయం నుండి సమాచారం వచ్చినా, ఆయన మాత్రం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 


సమాచారం లేదు... 
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి రావాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. దానికి స్పందనగా... సాయంత్రం 6.55 గంలటకు వస్తారని సీఎం కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. కానీ ఎట్ హోం కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదో తనకు తెలియదని గవర్నర్ తమిళిసై అన్నారు. తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తాను, హైకోర్టు సీజే అరగంట పాటు ఎదురు చూశామని, అతిథులంతా వెయిట్ చేస్తుండటంతో ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించామని గవర్నర్ విలేకరులకు తెలిపారు. 


ఎట్ హోంకు వచ్చిన సీఎస్.. 
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరి నుండి సాయంత్రం ఆరు గంటలకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ దంపతులు అప్పటికే రాజ్ భవన్ కు వచ్చారు. వారంతా ముఖ్యమంత్రి కోసం 7.20 గంటల వరకు ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో గవర్నర్ తేనేటి విందును ప్రారంభించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎట్ హోంకు హాజరు అయ్యారు. తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఎట్ హోం కార్యక్రమానికి కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య కూడా హాజరయ్యారు. హైదరాబాద్, రాచకొండ సీపీలు, పలువులు స్వాతంత్ర్య సమరయోధులు ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ రాలేదు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ కనిపించలేదు. 


వస్తారని సమాచారం, కానీ రాలేదు..


స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం 6.55 గంటలకు ముఖ్య మంత్రి రాజ్ భవన్ కు వస్తారని సీఎంవో సమాచారం ఇచ్చింది. సీఎం వస్తున్నారని పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్ భవన్ లో తేనీటి విందులను గవర్నర్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తేనేటి విందులనే ఎట్ హోంగా వ్యవహరిస్తుంటారు.