Gold Seized: స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక దారి మూసుకుపోతే మరో దారిలో, కొత్త కొత్త సాంకేతికతను వాడుతూ యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. పేస్ట్ రూపంలో, చాక్లెట్ల మాదిరిగా, బిస్కెట్లు లాగా.. ఇలా రకరకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అనేక మార్గాల్లో విదేశాల నుండి హైదరాబాద్ కు పుత్తిడిని తీసుకొస్తున్నారు. ఇలాంటి వారిని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు వివిధ మార్గాల్లో గుర్తించి పట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారాయి. తాజాగా మరోసారి కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు 2 కిలోల పుత్తడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


రియాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుండి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.1.13 కోట్ల ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికుల నుండి ఈ అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ముగ్గురు స్మగ్లర్లను పట్టుకుని వారి నుండి బంగారాన్ని రికవరీ చేశారు.


బంగారం పేస్ట్ రూపంలో పెట్టి రవాణా


రియాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. ముందే సమాచారం అందడంతో ఆ మేరకు వీరిని గుర్తించారు. ఆ ముగ్గురు ధరించిన సాక్సుల్లో పేస్టు రూపంలో బంగారాన్ని పెట్టి తీసుకొచ్చారు. పట్టుబడిన బంగారం 1818.98 గ్రాములు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. గోల్డ్ ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.  ఆ బంగారాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు, దాని వెనక ఎవరు ఉన్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.


చాక్లెట్ల రూపంలో బంగారం స్మగ్లింగ్


రెండు వారాల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 13 బంగారు చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారాన్ని పట్టుకున్నారు. ఆ ప్రయాణికులు తెచ్చుకున్న బ్యాగులను తనిఖీ చేయగా.. అందులో చాక్లెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ చాక్లెట్లు భిన్నంగా ఉండటంతో వాటిని పరిశీలించగా అవి బంగారు చాక్లెట్లగా తేలింది. ఈ బంగారు చాక్లెట్ల విలువ సుమారు 269 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.16.5 లక్షలు ఉంటుదని అంచనా వేశారు. 


గతనెలలో బూట్లలో బంగారం పట్టివేత


దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గోల్డ్ విలువ రూ.28.5 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 230 గ్రాముల సిల్వర్ కోటెడ్ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ.13.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. జడ్డా నుండి హైదరాబాద్ కు వచ్చిన మరో ప్రయాణికుడి నుండి రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్టు రూపంలోని బంగారాన్ని బూట్లలో దాచి తీసుకువచ్చాడు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా అడ్డంగా దొరికిపోయాడు.