GHMC Key Decision On Posters And Banners: హైదరాబాద్(Hyderabad) లో ఇకపై పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు పెట్టడానికి వీల్లేదు. వీటిపై GHMC నిషేధం విధించింది. వాల్ పోస్టర్లు కూడా వేయడానికి వీల్లేదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. పబ్లిక్ ప్లేస్‌ల్లో గోడలపై అనవసర రాతలను కూడా నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. సినిమాల పోస్టర్లు కూడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. 


అనుమతి పొందిన ప్రాంతాల్లో GHMC హోర్డింగ్‌లను అద్దెకు ఇస్తుంది. అధికారికంగా వీటి నిర్వహణ ఉంటుంది. అయితే అనుమతి లేకుండా నగరంలో చాలా చోట్ల ఇలాంటి హోర్డింగ్‌లు కనపడుతుంటాయి. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా రోడ్డు పక్కనే కడుతుంటారు. వీటి వల్ల ట్రాఫిక్‌కి అంతరాయం, పొరపాటున అవి మీద పడితే పెద్ద ప్రమాదం తప్పదు. అయితే ఎక్కడికక్కడ స్థానిక నేతలు తమ పలుకుబడితో వీటిని ప్రభుత్వ సిబ్బంది తొలగించకుండా చూస్తుంటారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, అందులోనూ అధికారంలో ఉన్న నేతల ఫ్లెక్సీలను తొలగించడానికి ఏ అధికారి కూడా ఉత్సాహం చూపించరు. ఇటీవల రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నగరంలో ఫ్లెక్సీలు కట్టారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా GHMC కఠిన నిర్ణయం తీసుకోవడం విశేషం. 


సంచలన నిర్ణయం


పోస్టర్లు, బ్యానర్లపై నిషేధం అంటే అది సంచలన నిర్ణయమేనని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ పెరిగినా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం అలవాటుగా మారింది. ఏ చిన్న కార్యక్రమం అయినా ముందు బ్యానర్ పడాల్సిందే. కార్పొరేటర్లకు సంబంధించి చాలా చోట్ల బ్యానర్లు కనపడుతుంటాయి. వీటన్నిటినీ తీసేయడం అంటే క్షేత్రస్థాయి సిబ్బందికి కత్తిమీద సామేనని చెప్పాలి. మరి GHMC ఆదేశాలు కాబట్టి అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 


తెలంగాణ(Telangana) పాలనపై తనదైన ముద్ర వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. హైడ్రాతో ఇప్పటికే సంచలనం సృష్టించారాయన. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా హైడ్రా విషయంలో ఆయన వెనక్కు తగ్గడం లేదు. కొత్తగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా కొన్ని చోట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మతపరమైన కార్యక్రమాల్లో క్రాకర్స్, డీజేలపై నిషేధం విధించేలా ఇటీవల పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే మత పెద్దలతో సమావేశమై చర్చించారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు పోస్టర్లు, బ్యానర్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కనీసం సినిమాలకైనా మినహాయింపు ఇస్తారా, సినిమా థియేటర్లు పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లకు అనుమతి ఇస్తారా.? అనేది వేచి చూడాలి.


Also Read: 'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్