Garuda Prasadam distribution stopped at Chilkur Balaji Temple- చిలుకూరు: మొయినాబాద్ సమీపంలో నెలకొన్ని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపి వేశాలని నిర్ణయించారు. సంతాన భాగ్యం కోసం ఇచ్చే గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్లు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు.
ఈరోజు (ఏప్రిల్ 19) చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి.. చిలుకూరు బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు. గరుడ ప్రసాదం పంపిణీపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఊహించిన దాని కన్నా వంద రెట్లు కాదు 1000 రెట్లు భక్తులు చిలుకూరుకు వచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే తొలిరోజు తరువాత రెండో, మూడో రోజు సైతం గరుడ ప్రసాదం వితరణ చేయడం ఉంటుందన్నారు. కానీ ఈ ఏడాది తొలిరోజుతోనే గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్లు రంగరాజన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 19తోనే పంపిణీ పూర్తయిందని, రేపు, ఎల్లుండి ఉండదని.. గరుడ ప్రసాదం కోసం భక్తులెవరూ చిలుకూరు బాలాజీ ఆలయానికి రాకూడదని, వచ్చి ఇబ్బంది పడకూడదని ప్రధాన అర్చకులు రంగరాజన్ సూచించారు.
శుక్రవారం ఉదయం కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
సంతానం లేని వారికి గరుడ ప్రసాదం వితరణ విషయం తెలియడంతో తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏప్రిల్ 19న ఉదయం నుంచే భక్తులు వాహనాలలో భారీ సంఖ్యలో అటువైపు రావడంతో, చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో లంగర్ హౌస్ నుంచి సన్ సిటీ, అటు నుంచి చిలుకూరు వరకు, అటు అప్పా జంక్షన్ నంచి చిలుకూరు ఆలయం వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాయి అయి వాహనదారులతో పాటు గరుడ ప్రసాదం కోసం విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు లక్ష మంది వరకు భక్తులు చిలుకూరు ఆలయం వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి ట్రాఫిక్ తో పాటు రద్దీని అదుపులోకి తెచ్చారు. గరుడ ప్రసాదం దక్కించుకునేందుకు బైక్స్, కార్లు ఎక్కడికక్కడే పార్క్ చేసి చిలుకూరు ఆలయానికి కాలినడకన వచ్చిన వారు సైతం ఉన్నారు. రేపు, ఎల్లుండి సైతం గరుడ ప్రసాదం ఇవ్వాల్సి ఉండగా.. వితరణ నిలిపివేశారు.
చిలుకూరు ఆలయంలో బ్రహ్మోత్సవాలు
చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 20న స్వామి వారికి గోపవాహన, హనుమాన్ వాహన సేవలు నిర్వహించనున్నారని అర్చకులు తెలిపారు. ఈ నెల 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం సేవలు ఉంటాయి. అదే రోజు రాత్రి 10:30 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకి సేవ, అర్దరాత్రి 12 గంటలకు స్వామి వారి రథోత్సవం ఊరేగింపు ఉంటుంది. ఏప్రిల్ 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, పుష్పాంజలి సేవలు నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో ఈ నెల 25న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.