Ganesh Nimajjanam 2022 Live Updates: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, కాసేపట్లో నిమజ్జనం
Ganesh Nimajjanam 2022 Live Updates: గణేష్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో గణపతి భక్తులకు ప్రసాద పంపిణీతో పాటు మంచినీటి ని అందిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని మైత్రీవనం వద్ద గణపతి భక్తులకు మంచినీరు, ప్రసాదం అందిస్తున్నారు. ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించి నిమజ్జనానికి సహకారం అందిచాలని కోరగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. హిందూ, ముస్లిం మతాల మధ్య సోదరభావం పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రారంభించినట్లు సైదులు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. బడా గణేశ్ టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సందడి నెలకొంది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అవుతున్న తీరును మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి బోట్ ద్వారా పరిశీలించారు.
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న మహా గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వెల్డింగ్ పనులు పూర్తి కాగానే గణపతికి ఉత్సవ సమితి నిర్వహకులు హారతి ఇచ్చి శోభాయాత్రను మొదలుపెట్టారు.
ఖైరతాబాద్ గణేష్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. నగరంలో వైభవంగా నిమజ్జనం జరుగుతుందని అన్నారు. అసౌకర్యాలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా చూస్తున్నారని అన్నారు.
నల్గొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి పూజలు చేయించారు. అనంతరం శోభా యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 10-20 అడుగుల పెద్ద విగ్రహాలు దండంపల్లి కాలువ వద్ద, 10 అడుగుల విగ్రహాలు వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. లడ్డూను ఏకంగా 24 లక్షల 60 వేలు చెల్లించి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.
5 లక్షల నుంచి ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ ధరను వేలం పోటీలో పాల్గొన్న వారు అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. కొద్ది నిమిషాలకే వేలంలో లడ్డూ ధర 20 లక్షలు దాటేసింది.
29వ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభం అయింది. ఇందులో 9 మంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకునేందుకు ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడుతున్నారు. వీరిలో జక్కిడి శివచరణ్ రెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, ఎర్ర జయిం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొణతం ప్రకాశ్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కొలను శంకర్ రెడ్డి తదితరులు వేలం పాటలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గణేష్ ఉదయం 5 గంటలకే ఆఖరి పూజలు అందుకున్నాడు. అనంతరం బాలాపూర్ గ్రామంలో గణేష్ శోభయత్ర కనులపండువగా జరుగుతోంది. బాలాపూర్ వీధుల్లో గణేష్ శోభయత్ర ఘనంగా సాగుతుంది....
బాలాపూర్ నడిబొడ్డున్నఉన్న బొడ్రాయి వద్ద మరికొద్దిసేపట్లో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. ఇప్పటిదాకాడా గణనాథుడి ఊరేగింపులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈసారి లడ్డూ వేలంపాటలో 9 మంది పాల్గొంటున్నారు. వారిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాదని తెలిసింది.
గణేష్ నిమజ్జనాల కోసం హుస్సే్న్ సాగర్ చుట్టూ 22 క్రేన్లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం దాదాపు 3 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారు. పర్యవేక్షణ కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగింపునకు 20 జేసీబీలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కారణంగా రేపు ఉదయం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. శోభాయాత్ర జరిగే మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు.
బాలాపూర్ గణపతి లడ్డూ వేలం నేడు కాసేపట్లో జరగనుంది. దీంతో ఈసారి లడ్డూ ఎంత ధర పలుకుందనేదానిపై ఆసక్తి నెలకొంది. 28 ఏళ్లుగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం జరుగుతుండగా, ఏటా రూ.లక్షలు చెల్లించి లడ్డూ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బాలాపూర్ లడ్డూ ధర రూ.18 లక్షల 90 వేలు పలికింది.
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మొదలయింది. భారీ వినాయకుడి విగ్రహం నిమజ్జనం కోసం ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ దిశగా యాత్రగా వెళ్తూ ఉంది. మధ్యాహ్నం లోపు నిమజ్జనం జరగనుంది. దీని వల్ల ఆ మార్గంలో ఎలాంటి వాహన రాకపోకలను అనుమతించడం లేదు. సాగర్ కు గణనాథులు వచ్చే రూట్లు అన్నింటిలో సాధారణ వాహనాలను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లోని గణేష్ విగ్రహ నిమజ్జనంలో ఓ అపశ్రుతి జరిగింది. కర్మన్ ఘాట్ లోని టీకేఆర్ కాలేజీ దగ్గర 20 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయగా, శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. వర్షానికి విగ్రహం నానిపోయి కుప్పకూలింది. హిమాయత్ నగర్ వద్ద విగ్రహం పడిపోయింది.
హైదరాబాద్ మెట్రో రైలు నడిచే సమయాలను నేడు పొడిగించనున్నారు. ఇవాళ గణేష్ నిమజ్జనం కాబట్టి, మెట్రో రైళ్ల ట్రిప్పులు, సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం చెప్పారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నేడు నడుస్తాయని చెప్పారు. లాస్ట్ స్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు ఆఖరి మెట్రో రైళ్లు బయలు దేరతాయని చెప్పారు.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం వేళ హుస్సేన్‌సాగర్ చుట్టూ 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని అన్నారు. విగ్రహ వ్యర్థాలు తొలగించేందుకు 20 జేసీబీలు సిద్ధం చేశారు.168 యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.
Background
Ganesh Nimajjanam 2022: ఒక్కో తత్వానికి ఒక్కొక్కరు ప్రతీకలు... జల తత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే ‘గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తాం.
ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః
మహాగణపతి ఆరాధనతో పకృతి పులకిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. గణపతి పండుగలోని అంతరార్థం...ఆయనకు ఉండ్రాళ్లు పెట్టడం, భారీ విగ్రహాలను ప్రతిష్టించడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం కాదు..ఏ మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు.. మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం.
Also Read: అక్టోబరు, నవంబరులో ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం రద్దు
మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాల్వల పూడికతీయడం. అంటే వినాయకుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు,కుంటలు కళకళలాడాలి. మరోవైపు మట్టి పూడికతీత పనుల వల్ల భూగర్భజల మట్టం పెరిగేది.
మొక్కలకు ఎరువుగా…
ఇంట్లో మట్టి ప్రతిమలు పూజాదికాలు పూర్తయ్యాక...పత్రి, నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్టుకింద ఉంచేవారు. తద్వారా ఎంత బలహీనంగా ఉండే చెట్టు అయినా ఏపుగా పెరిగేది. ఎందుకంటే పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని విశిష్టగుణాలు ఉండటమే ఇందుకు కారణం.
నిమజ్జనం వెనుక
నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో, కుంటలోనూ నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక... ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.
Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!
గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర
యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥
‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు.
మట్టిలో కలవాల్సిందే
భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలియజేస్తాడు గణనాథుడు. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది తాత్వికార్థం.
- - - - - - - - - Advertisement - - - - - - - - -