Ganesh Laddu 60 Lakh: బాలాపూర్ గణేష్ లడ్డూతో పాటు అల్వాల్ లోని కానాజీగూడ మరకట గణేషుడి లడ్డూ ధరలను కూడూ బ్రేక్ చేస్తూ.. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని సన్ సిటీ గణేషుడి లడ్డూ రికార్డు సృష్టించింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్ నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో రూ. 60.83 లక్షలు పలికింది. సన్ సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్ లోని ఆర్మీ దివ్యా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఈ ట్రస్టుకు అర్చనా సిన్హౌ, దేశ్ పాండే మేనేజింగ్ ట్రస్టీలుగా ఉన్నారు. ఈ లడ్డూ ధర గతేడాది రూ. 41 లక్షలు పలికింది.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం..
గణేష్ లడ్డూ వేలం అనగానే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది బాలాపూర్ మాత్రమే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు బాలాపూర్ గ్రామంలో నగరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూను వేలం వేయడాన్ని మొదట ప్రారంభించింది అక్కడే. మొదట కొంత మొత్తం ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ.. బాలాపూర్ లడ్డూ వేలం ధర వేలు, 10 వేలు, లక్షలు దాటి పదుల లక్షల్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం దాని రికార్డును అదే బద్దలు కొట్టుకుంటోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు తమకు చాలా మంచి జరుగుతోందని బలంగా నమ్ముతున్నారు. అది వారికి, వారి కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు మేలు జరుగుతోందని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా పాకింది. బాలాపూర్ లడ్డూను ఎలాగైన సొంతం చేసుకోవాలన్న కాంక్ష పెరిగి పోయింది. ఇందుకోసం లక్షలాది రూపాయలు సైతం వెచ్చించడానికి వెనకాడటం లేదు.
రూ. 24.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ
ఎన్నడూ లేనంత ఎక్కువ మొత్తంలో ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ. 24 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తం వెచ్చించి లడ్డూ వేలం వేయడం ఇదే ప్రప్రథమం. ఇదే రికార్డు అని అంతా అనుకున్నారు. కానీ అంతకుమించి అత్యధిక ధరను సొంతం చేసుకుంది మరకట గణేష్. బాలాపూర్ గణేష్ రూ. 24.60 లక్షలు అయితే.. మరకట గణేషుడి లడ్డూ ఏకంగా.. రూ. 46 లక్షలు పలికింది.
రూ. 46 లక్షలు పలికిన మరటక గణేషుడి లడ్డూ
హైదరాబాద్ శివారు అల్వాల్ సర్కిల్ వద్ద మరకట శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా జరిగాయి. ఆఖరి రోజూ లడ్డూ వేలం పాట పాడారు. వేలంలో ఏకంగా రూ. 46 లక్షలు పలికింది. గీత ప్రియ వెంకటరావు దంపతులు.. ఈ ఏడాది మరకట గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కూడా గీత ప్రియ వెంకటరావులే మరకట గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం మరకట గణపతి లడ్డూ వేలం పాటలో సొంతం చేసుకోవడంతో.. ఆ దేవుని కటాక్షం సిద్ధించిందని గీతప్రియ వెంకటరావు దంపతులు తెలిపారు. అందుకే మరోసారి మరకట గణేష్ లడ్డూ సొంతం చేసుకోవాలని అనుకున్నట్లు వారు వివరించారు. ఈ సారి ఎంత ధర అయినా పలికి మరకట గణేషుడి లడ్డూ సొంతం చేసుకుందామని ముందే అనుకున్నట్లు వాళ్లు వెల్లడించారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రూ. 24.60 లక్షలు కాగా.. మరకట గణపతి లడ్డూ రూ. 46 లక్షలు పలకడం రికార్డు.
అయితే ఈ రెండింటి రికార్డులను బద్ధలు కొడుతూ... బండ్లగూడలోని గణేష్ లడ్డూ రికార్డు స్థాయి ధరను పలకడం గమనార్హం.