Ganesh Immersion 2023: వినాయక చవితి రోజు నుంచి పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు గురువారం రోజు గంగమ్మ ఒడిని చేరుకున్నాడు. భక్తి శ్రద్ధలతోపాటు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మళ్లీ ఏడాది తిరిగిరమ్మంటూ లంబోదరులను సాగనంపారు. డీజే చప్పుళ్ల హోరు, యువతీయువకులు తీన్ మార్ స్టెప్పులతో రాష్ట్రం అంతా ఊగిపోయింది. ఎక్కడిక్కడ చిన్నా, పెద్దా తేడా లేకుండా డ్యాన్సులు వేశారు. గణపతి బప్పా మోరియా అంటూ హోరెత్తించారు. కోలాటాలు ఆడుతూ కొందరు, భక్తి పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ మరికొంత మంది గణనాథులను గంగమ్మ ఒడికి పంపించారు. 


రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది పోలీసులతో బందోబస్తు


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా పది వేలకు పైగా విగ్రహాలకు నిర్వాహకులు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 90 వేల గణపతుల నిమజ్జనం శుక్రవారం రోజు ఉదయం వరకు జరగనుంది. 63 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటిగంట 27 నిమిషాలకు నిమజ్జనం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కో విగ్రహానికి ముగ్గురి నుంచి ఐదుగురు సిబ్బందిని కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అవసరం మేరకు వివిధ జిల్లాల్లో విధులు కేటాయించగా.. నిమజ్జనం వరకు నిర్ణీత ప్రాంతంలో విధుల్లో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 60 వేల మంది నిమజ్జన బందోబస్తులో మోహరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 


ఒక్క హైదరాబాదులోనే 40వేల మంది పోలీసుల బందోబస్తు


ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 40 వేల మంది పోలీసులు నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారని అధికారులు వివరించారు. గురువారం రోజు నగరవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలను పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షించింది. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీలో అగ్నిమాపక శాఖ 102 ప్రాంతాల్లో అగ్నిమాపక వాహనాలను మోహరించింది. మహిళా పోలీసులకు ప్రత్యేక వసతులు కల్పించారు. అలాగే ఈసారి ట్యాంక్ బండ్ పరిసరాల రూపురేఖలు మారిపోవడం గణనాథుల శోభాయాత్రకు బాగా కలిసి వచ్చింది. గతంలో ట్యాంక్ బండ్ పరిసరాలు ఇరుకుగా ఉండడంతో ఊరేగింపులో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కునేవారు. కానీ ప్రస్తుతం రహదారులు వెడల్పు అవడంతో.. గణనాథుల శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులూ కల్గలేదు. అలాగే చిరు వ్యాపారస్తులు కూడా సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకున్నారు. ప్రతీ రోజూ వచ్చే దానికంటే గురువారం రోజు తమకు లాభం త్రిబుల్ అయిందని హర్షం వ్యక్తం చేశారు.  


రికార్డు స్థాయిలో పలికిన గణేష్ లడ్డూలు..


ఈసారి గణపతి లడ్డూలకు అనూహ్యమైన పోటీ పెరిగింది. బండ్లగూడ జాగీర్ పరిధిలోని సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన లడ్డూ ఏకంగా కోటి 26 లక్షలు పలికింది. అలాగే బాలాపూర్ గణేష్ లడ్డూ 27 లక్షలకు అమ్ముడు పోయింది. 


Read Also: Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం