Euro Fin Group In Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్‌ వేదికగా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారతీయ ఔషధ మార్కెట్ లో విస్తరించేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్‌ సంస్థ అభిప్రాయపడింది. హైదరాబాద్ వేదికగా క్యాంపస్ నెలకొల్పుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 


తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్ టెల్ సంస్థ ముందుకు వచ్చింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతతోపాటు హైపల్ స్కేల్ డేటా సెంటర్ ను హైదరబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ ఈ సెంటర్ ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అవసరం అయిన మౌలిక సదుపాయల కల్పన కోసం రెండు వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో భారతీ ఎయిర్ టెల్ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్ బుధవారం సమావేశం అయ్యారు. 


అనంతరం 60 మెగావాట్ల సామర్థ్యంలో హైపల్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ సెంటర్ రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో పూర్తి స్థాయిలో పని చేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... భారతదేశంలో హైపల్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్ గా మారిందని, ఎయిర్ టెల్ తాజా పెట్టబుడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధ చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్ టెల్-నెక్స్ ట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వివరించారు. 






భారతీయ ఔషధ మార్కెట్ లో విస్తరించేందుకు హైదరాబాద్ లో క్యాంపస్ ను నెలకొల్పుతున్నట్లు ఫ్రాన్స్ కు చెందిన యూరోఫిన్స్ సంస్థ తెలిపింది. ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మొటిక్ ఉత్పత్తుల పరీక్షలో ఈ సంస్థ పేరుగాంచింది. ఈ క్రమంలోనే దావోస్ లో బుధవారం రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో యూరోఫిన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు యూరోఫిన్స్ ప్రకటించింది.