Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో మూడు నుంచి ఐదు అత్యున్నత శ్రేణి స్థిరాస్తి ప్రాజెక్టులను ప్రారంభించబోతుంది. ట్రంప్ నకు చెందిన స్థిరాస్తి సంస్థ ద ట్రంప్ ఆర్గనైజేషన్ వచ్చే ఏడాది నుంచి వీటిని మొదలు పెట్టనున్నట్లు పేర్కొంది. దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కల్పేష్ మెహతా నేతృత్వంలోని ట్రైబెకా డెవలపర్స్ తో గత పదేళ్లుగా భారత్ లో ప్రత్యేక లైసెన్సు అగ్రిమెంట్ ను ట్రంప్ ఆర్గనైజేషన్ కల్గి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వచ్చే సంవత్సర కాలంలో 7 నుంచి 8 ప్రాజెక్టులపై రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఓ కార్యక్రమంలో మెహతా తెలిపారు. ఇందులో రెండు వేల 500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రారంభించే మూడు నుంచి ఐదు స్థిరాస్తి ప్రాజెక్టులపై వెచ్చించనున్నామని ఆయన వివరించారు.
అయితే హైదరాబాద్, బెంగళూర్, చండీగఢ్, లుథియానాలలో ఈ ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నట్లు మెహతా స్పష్టం చేశారు. అలాగే ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సమక్షంలో మెహతా ఈ ప్రకటన చేశారు.
డెవలపర్లతో చర్చలు కొనసాగింపు..
ట్రంప్ ప్రాజెక్టుల కోసం చండీగఢ్ మరియు లూథియానాలోని డెవలపర్‌లతో కూడా చర్చిస్తున్నట్లు ట్రిబెకా గ్రూప్ సీఈఓ హర్షవర్ధన్ ప్రసాద్ తెలిపారు. విశేషం ఏమిటంటే, భారతదేశం ఇప్పటికే నాలుగు ట్రంప్ బ్రాండెడ్ ఆస్తులను కలిగి ఉంది. ఇది అమెరికాల తర్వాత ట్రంప్ సంస్థకు భారతదేశం అతి పెద్ద మార్కెట్‌గా మారింది. ఈ నాలుగు ఆస్తులు 2.6 మిలియన్ చ.అ.ల విస్తీర్ణంలో విక్రయించబడ్డాయి. పూణేలోని పంచశీల్ బిల్డర్స్ సహకారంతో వీటిని అభివృద్ధి చేశారు.
భారతదేశంలో కంపెనీలను విస్తరించడం సంతోషంగా ఉంది..
ఈ కార్యక్రమంలో, ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ, కల్పేష్ మెహతాతో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని.. అది తమకు చాలా సంతృప్తిని ఇస్తుందని వివరించారు. అలాగే భారత దేశంలో కంపెనీలను విస్తరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలోనే ట్రిబెకా అభివృద్ధి సామర్థ్యాలు ప్రస్తుతం అత్యుత్తమ ప్రపంచ లగ్జరీ డెవలపర్‌లకు పోటీగా నిలిచే స్థాయికి రావడం గమనార్హం అని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో స్వదేశీ మార్కెట్ వెలుపల తమ బ్రాండ్‌కు భారతదేశాన్ని అతిపెద్ద మార్కెట్‌గా మార్చారని చెప్పుకొచ్చారు.