Former Minister Azmeera Chandulal son Azmeera Prahlad Joins BJP:
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ నేతలు పార్టీలు జంప్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు బీఆర్ఎస్ నేత అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. ప్రహ్లాద్ తో పాటు బీజేపీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి మోహన్ రావు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
బీజేపీ అన్నీ వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తుందని... కేంద్రంలో ఉన్న 75 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారని బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. 12 మంది ఎస్సీ లు, 08 మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారని.. కేవలం బీజేపీలోనే ఇది సాధ్యం అయ్యిందన్నారు. ఆదివాసీ మహిళ (ద్రౌపది ముర్ము)కు అత్యున్నత స్థానం రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి రాష్ట్రపతి ఎస్సీని చేసిన ఘనత కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ప్రహ్లాద్ తో పాటు వెళ్తారేమో అని ములుగులో రెండు రోజులుగా ఇళ్లకు తాళాలు వేసి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ డబ్బులు మావి తప్ప, నీ ఇంట్లో నుండి ఇవ్వడం లేదు. పెన్షన్ తీసేసే దమ్ము ఏ పార్టీకి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పైసల మీద మీ పెత్తనం ఏంటని ఈ సందర్భంగా ఈటల అడిగారు. ఉపవాసం ఉండి చదువుకున్న వారికి కాదు.. డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు అంటూ పేపర్లు లీకు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది అన్నారు.
కేసీఆర్ డబ్బు సంచులకు, మందు సీసాలకు ప్రజలు లొంగరని హుజురాబాద్ ఉప ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంకేతం ఇచ్చాయన్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతా కూడా ఇదే రిపీట్ కాబోతుందన్నారు. ములుగు నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండానే అని... ప్రహ్లాద్ ని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.
అజ్మీరా ప్రహ్లాద్ తండ్రి అజ్మీరా చందూలాల్ ఉమ్మడి ఏపీలో, ఆపై తెలంగాణ కేబినెట్ మంత్రిగా సేవలు అందించారు. పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ మంత్రిగా చేశారు. 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అజ్మీరా చందూలాల్, ములుగు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రి పదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన 2021 ఏప్రిల్ 15 న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం రాజకీయ పరిణామాలతో ఆయన తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ బీఆర్ఎస్ కు వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.