Guvvala Balaraju : బీఆర్‌ఎస్‌కు ఈ మధ్య రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ ఉదయం ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో సమావేశమయ్యారు.అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. సన్నిహితులు అనుచరులతో చర్చించిన తర్వాత కమలం కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు బాలరాజు తెలిపారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారం జరుగుతున్న వేళ ా పార్టీ వైపు కొందరు బీఆర్‌ఎస్‌నేతలు చూస్తున్నారు. ఈ మధ్యే కారు దిగిన గువ్వల బాలరాజు కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో అనుచరులతో సమావేశమయ్యారు. ఎందుకు గులాబీ పార్టీకి రాజీనామా చేశారో వారికి వివరించారు. 

చాలా కాలంగా బీఆర్‌ఎస్‌ అవమానాలు ఎదుర్కొన్నట్టు బాలరాజు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలు ఏ పదవుల్లో ఉన్నా సరే వారికి బానిసలుగానే ఉండాలనే సిద్ధాంతం పార్టీలో ఎక్కువైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్‌ఎస్ వెనకుబడిందని విమర్సించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆలోచన కూడా అధినాయకత్వం చేయలేదని అన్నారు. 

ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోందని బాలరాజు అభిప్రాయపడ్డారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతోందని ముందే వెళ్లడం మంచిదని ఈ మధ్య ఓ ఫోన్ సంభాషణలో బాలరాజు చెప్పినట్టు ప్రచారం సాగింది. 

గువ్వల బాలరాజు 2007లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీకి పూర్తి కమిట్‌మెంట్‌తో పని చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందుకే 2009లో నాగర్‌కర్నూలు నుంచి లోక్‌సభ స్థానానికి అప్పటి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014, 2018లో అచ్చంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంచారు. ఇప్పుడు సడెన్‌గా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడంతో అంతా షాక్ అయ్యారు.