Underpass at kbr park in hyderabad | హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. నగరం నడిబొడ్డున రద్దీ అధికంగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక ట్రాఫిక్ ఉండే కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ (KBR Park Flyover) నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ పనులతో ఎకో సెన్సిటివ్ జోన్ దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కి వస్తున్నాయి. దాంతో కొత్త డిజైన్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ నియంత్రించేందుకు కొత్త డిజైన్లతో పనులు చేపట్టాలని జిహెచ్ఎంసి భావిస్తోంది. ఏర్పాటుచెట్టు పలు ఆస్తులు సేకరించాల్సి ఉండగా, భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.
ప్రాజెక్టు డిజైన్లు మార్చి సమస్యకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్య తీర్చడానికి కేటీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ లను రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టాలని భావించింది. కానీ ఆ పనుల ద్వారా కేబీఆర్ పార్క్ స్థలంలో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పలు కేసులు నమోదు కావడంతో పనులు మొదలుకాలేదు. ఆ సమస్యను గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేబీఆర్ పార్కు వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డిజైన్లను కాస్త మార్చింది. ఎకో జోన్ కు దూరంగా ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గంలోనే కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ తొలగించే చెట్లను మరోచోట ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం కనుక సాధ్యమైనంత త్వరగా కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు పూర్తి చేస్తే ఈ మార్గంలో వెళ్లే నగర వాసులకు ట్రాఫిక్ సమస్య తీరనుంది. ప్రతిరోజూ ఉదయం ఆఫీసులకు, పనులకు బయలుదేరే వారు రోడ్లపై వాహనాలు కదలక ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకే పలు ఏరియాలలో ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతున్న ప్రభుత్వం తాజాగా కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ చేసింది.
ఎలివేటెడ్ కారిడార్‌తో ఏఓసీ రోడ్ల సమస్యకు చెక్మరోవైపు రక్షణశాఖ అధికారులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రోడ్లను తరచూ మూసేస్తుంటారు. అక్కడ సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 6 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు చీఫ్ ఇంజనీర్ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తయితే ఆ ఆర్మీ పరిధిలోని ఏఓసీ రోడ్లతో పనిలేకుండానే ప్రయాణికులు మల్కాజిగిరి- సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య రాకపోకలు చేసే వీలుంటుందన్నారు.