పండగ వచ్చిందంటే చాలా... ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య సరదాగా పండుగ చేసుకోవాని భావిస్తారు. కానీ... ఈసారి వారి ఆశ అడియాశ కాబోతోంది. దసరా, దపావళి సమయంలోనే కాదు... సంక్రాంతికి కూడా రైళ్లన్నీ నిండిపోయాయి. బెర్త్ కోసం క్లిక్ చేస్తే... కనీసం ఓపెన్ కాకుండా రిగ్రెట్ అని కనిపిస్తోంది. ప్రధాన రైళ్లలో అయితే... వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంది. దీంతో పండగకు ఊరు వెళ్లాలనుకునే వారి పరేషన్ తప్పడంలేదు.
సంక్రాంతికి ఇంకా 4 నెలలు ఉన్నా... రైళ్లలో సీటు మాత్రం లేదు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండగలు ఉన్నాయి. కానీ.. జనవరి 11 నుంచే రిజర్వేషన్ దొరకడంలేదు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఏపీకి నడిచే రైళ్లలో టికెట్ల బుకింగ్ పూర్తై రిగ్రెట్ చూపిస్తున్నాయి. ఏ ట్రైన్ చూసినా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ట్రైన్లలో వెయిటింగ్ లిస్టు ఐదారు వందలు దాటింది. దీంతో రైలు ప్రయాణంపై ఆశలు వదులుకుంటున్నారు ప్రయాణికులు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్నామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు.
సంక్రాంతి పండగకు.. హైదరాబాద్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి సొంతూళ్లకు వెళ్తారు. అందుకోసం మూడు నెలల ముందే రైలు రిజర్వేషన్లు చేసుకుంటారు. కానీ ఈసారి పెద్ద పండగకు నాలుగు నెలల సమయం ఉన్నా... అప్పుడే రైళ్లన్నీ నిండిపోవడంతో... వారంతా నిరాశ చెందుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నర్సాపురం, తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో పండుగ సమయంలో రైల్వే శాఖ నడిపే ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహనాలే నమ్ముకుంటున్నారు. సంక్రాంతికే కాదు.. దసరా, దీపావళికీ ఇదే పరిస్థితి. పండుగల వేళ రైలులో కాలు పెట్టే ప్లేస్ కూడా కనిపించడంలేదు. అక్టోబరు 24న దసరా కాగా.. 22న ఆదివారం నుంచే చాలామంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈసారి కూడా ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉంది. అంతేకాదు.. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వెయిటింగ్‌లిస్ట్ ఉన్న రైళ్లకు అదనపు బోగీలు కూడా అటాచ్ చేస్తూ ఉంటుంది. అయితే పండగలకు ఇంకా సమయం ఉండటంతో... ఆ దిశగా ఇంకా చర్యలు చేపట్టలేదు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కానీ... ప్రతి ఏటా పండగల సీజన్‌లో ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. రైళ్లలో ముందస్తు బుకింగ్‌లు కూడా పూర్తయిపోతున్నాయి. దీంతో రైల్వేశాఖ కూడా ఆలస్యం కాకుండా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తే.. పండగ ప్రయాణంపై పరేషాన్ తగ్గుతుంది. పండగలకు ఊరు వెళ్లాలనుకునే వారికి ఊరట లభిస్తుంది. ప్రత్నమ్యాయ ఏర్పాట్లు చేసుకోకుండా... ప్రత్యేక రైళ్లలో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.