6000 farmer committed suicide in Telangana state since 2014: బీఅర్ఎస్ పాలకులు రాష్ట్రంలో వ్యవసాయం పండగ చేస్తాం అని దండగ చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ హామీలు, వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ మూడో ఛార్జీ షీట్ (వ్యవసాయరంగం) విడుదల చేసింది. రైతు బంధు ఒక్కటే సర్వరోగ నివారిణి అని బీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు, మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.


రుణమాఫీ పూర్తి కాలేదు, కొత్త రుణాలు దొరకక.. పెట్టుబడి లేక ఓ వైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు, అప్పుల బాధను తట్టుకోలేక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అంటే కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్న కాలంలోనే దాదాపు ఇంత మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సన్నాసిలా వ్యవహరిస్తున్నారని.. రైతులు చనిపోతే.. సినిమా థియేటర్ లో టికెట్ల కోసం తొక్కిసలాట లో కూడా చనిపోతారు అనడం దారుణం అంటూ మండిపడ్డారు. 


రైతుల ఆత్మహత్యల్లో నాల్గో స్థానం 
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉండటం బాధాకరం అన్నారు. కోటి ఎకరాల మాగాణి అన్న కేసీఆర్ మాటలు ఓ భూటకం అని, సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయ్యిందని చెప్పారు. రైతు బందు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంగళం పాడిందని సెటైర్లు వేశారు. ప్రకృతి వైపరీత్యాల నష్టం ను సర్కార్ పట్టించుకోవడం లేదు, భూసార పరీక్షల ఉసే లేదని తెలిపారు. 


పంటకు మద్దతు ధర లేదు, సబ్సిడీలు ఎత్తేసిన సర్కార్
సీడ్ బౌల్ పై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని, రాష్ట్రంలో కల్తీ విత్తనాలు అరికట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి. కల్తీ విత్తనాల వల్ల 15 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు, రైతులకు ఉచిత ఎరువుల హామీ గాలికి వదిలేశారని విమర్శించారు. విద్యుత్ పంపులపై సర్ చార్జీలు ఎత్తివేస్తానని చెప్పి మాట తప్పారు, రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదు.. విత్తన సబ్సిడీ లేదన్నారు. 


వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను గందర గోళానికి గురి చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. వరి కొనుగోలు చేయమన్నారు.. తరువాత ప్రతిపక్షాల నిరసన పోరాటాలు, రైతుల నిరసనలతో దిగొచ్చిన సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి వరి సాగు చేయని రైతులను కనీసం ఆదుకోలేదన్నారు. ఆ రైతులు రాష్ట్రంలో రైతు భీమా పధకం అమలుకు నోచుకోలేదు, పోడు భూముల సమస్యను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.