హైదరాబాద్: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు మండలి (SEIAA) సమావేశంలో ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 4,200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే గత నెలలో కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలను పర్యావరణ ప్రభావ మదింపు మండలికి అందజేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతులపై ఉత్తర్వులు వస్తాయని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ఊట్కూరు, మద్దూర్, కొడంగల్, కోస్గి, మక్తల్, బొంరాస్‌పేట లాంటి 10 మండలాల పరిధిలో సుమారు 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. భూసేకరణలో భాగంగా రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని అధికారులు తమ నివేదికలో సూచించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుమారు 4,425 చెట్లను తొలగించాల్సి వస్తుందని, దానికి ప్రత్యామ్నాయంగా కాలువలు, చెరువు కట్టల వెంబడి అంతకు పదింతల మొక్కలను నాటి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
సీఎం నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరుతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాంతో పాటు ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. దాదాపు రూ.4,885 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 209 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భవిస్తోంది. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ పంపుహౌస్‌లు, ప్రెజర్ మెయిన్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ నిర్వహించి, కాంట్రాక్ట్ సంస్థలకు పనులు కూడా అప్పగించారు. పర్యావరణ అనుమతులు మంజూరైతే ఉత్తర్వులు జారీ అయితే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.
ప్రాజెక్టు ప్రాముఖ్యత, ప్రత్యేకత ఇదే..ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వెనుకబడిన ప్రాంతాలకు ఈ పథకం ప్రాణవాయువు లాంటిది. భూ సేకరణో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అనేది ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఇచ్చిన అత్యుత్తమ ధరలలో ఒకటి. ఇది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేలా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో అత్యాధునిక 'ప్రెజర్ మెయిన్' పైపులైన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు, దీనివల్ల నీటి వృధా తగ్గి నేరుగా పొలాలకు నీరు చేరుతుంది.