ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వినతిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరస్కరించారు. విచారణకు రావాల్సిందేనని ఆదేశించారు. ఎమ్మెల్యే లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని నేడు ఈడీ విచారణ చేయాల్సి ఉండగా, ఆయన హాజరు కాలేనని ఈడీని కోరారు. ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు తనకు ఇంకా సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 25 వరకూ తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన లాయర్ తో ఈడీకి రోహిత్ రెడ్డి లేఖ పంపించారు. ఈడీ అధికారులు అడిగిన మేరకు బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి తెలిపారు. ఇటీవల వరుసగా బ్యాంకు సెలవులు ఉన్న కారణంగా బ్యాంకు స్టేట్మెంట్స్ తీసుకోలేదని లేఖలో ప్రస్తావించారు.
గత శుక్రవారం నాడు రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ రెడ్డి తాజాగా చేసిన వినతిని ఈడీ అధికారులు తిరస్కరించారు.
సోమవారం (డిసెంబర్ 19) ఈ ప్రకటన చేసేందుకు ముందు రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రగతి భవన్‌లో సీఎం, పైలెట్ రోహిత్ రెడ్డి భేటి చాలా సేపు జరిగింది. లోపల సీఎం కేసీఆర్, న్యాయ నిపుణులతో పైలెట్ రోహిత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రగతి భవన్ నుండి బయటకు వచ్చి తనకు సమయం కావాలని ప్రకటన చేశారు. ఇప్పటికే తమకు గడువు కావాలంటూ ఈడీ కార్యాలయానికి పైలెట్ రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ కుమార్ లేఖ పంపించారు. అయితే, పైలెట్ రోహిత్ రెడ్డి అడిగిన గడువును ఈడీ తిరస్కరించింది.