తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షా క్వశ్చన్ పేపర్‌ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారన్న అభియోగాలపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలుపెట్టింది.


కోట్ల రూపాయల నగదు కూడా హవాలా రూపంలో చేతులు మారినట్లుగా రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్‌గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్న పత్రం లీక్ అయినట్టు గుర్తించింది. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు అందజేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో ఆదేశించింది. కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్‌లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనుంది.


ఇప్పటిదాకా 17 మంది అరెస్టు


ఇక పేపర్ల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) ఏర్పాటు చేసిన నాటి నుంచి ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సిట్‌ అధికారులు మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని పలు వివరాలు రాబట్టారు. దాదాపు 150 మందిని విచారణ చేసిన అధికారులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీ సహా పలువురి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ మొత్తం నివేదికను నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు. దర్యాప్తు రిపోర్టులో నిందితుల పెన్‌డ్రైవ్, మొబైల్స్‌లో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు రూపొందించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికను కూడా జతపరిచారు.