Kedarnath Temple in Medchal: ఉత్తరాదిన ఎంతో విశిష్టత కలిగిన దేవాలయాన్ని తెలంగాణలో అందులోనూ హైదరాబాద్ లో నిర్మించబోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి ఉండేలా ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మేడ్చల్ మండల పరిధిలోని ఎల్లంపేట గ్రామంలో బుధవారం (జూలై 17) ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య, కమల్ నారాయణదాసు మహారాజ్ లు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పూజ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ ఏసీబీ బి. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కేదార్ నాథ్ ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చార్ థామ్ యాత్రకు వెళ్లేందుకు వీలుకాని వారెవరైనా ఇక్కడ నిర్మించబోతున్న కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చని అన్నారు.