Drone Show Durgam Cheruvu: హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై దశాబ్ది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సైబరాబాద్ పోలీసులు ఆధ్వర్యంలో ఆదివారం 500 డ్రోన్లతో నిర్వహించిన షో విశేషంగా ఆకట్టుకుంది. చిమ్మ చీకట్లలో లేజర్ డ్రోన్లతో చేసిన షో అబ్బురపరిచింది. కారు, సీఎం కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్, సచివాలయం, యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, పోలీస్ ఇమేజ్ టవర్స్, షీటీమ్స్, సైబరాబాద్ పోలీసు లోగోలను డ్రోన్లతో ప్రదర్శించారు. 






సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ డ్రోన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ డ్రోన్ షో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొని వీక్షించారు. డ్రోన్ షో ద్వారా తెలంగాణ సాధించిన పురోగతిని, అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు బృంధాన్ని అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ఈ డ్రోన్ షో ఫోటోలను, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.






ఈ లేజర్ షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ విజువల్స్ చూపించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను ప్రదర్శించారు. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూపాన్న డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లేజర్ డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. 






సుమారు 15 నిమిషాల పాటు ఈ డ్రోన్ షో జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల చిహ్నాలతో డ్రోన్లు ప్రదర్శన ఇచ్చారు. అంబేడ్కర్, కేసీఆర్, సచివాలయం, తెలంగాణ పోలీసు లోగో, కాళేశ్వరం ప్రాజెక్టు, కారు గుర్తు, టీ-హబ్, మిషన్ భగీరథ చిహ్నాలు ప్రదర్శించారు. ఆఖర్లో జై తెలంగాణ.. జై భారత్ అనే పదాలు వచ్చి డ్రోన్ షో ముగిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు అందరూ తొమ్మిదేళ్లలో తమ శాఖల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసేలా నివేదికలు, డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నారు. 21 రోజుల పాటు సాగనున్నఈ దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి, అభివృద్ధి ప్రతి ఊరు వాడా తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.