28 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న పరిపాలనా భవనం.. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో రూపుదిద్దుకున్న కట్టడం! తెలంగాణ నూతన సచివాలయం.. వందేళ్ల విజన్ కు నిలువెత్తు నిదర్శనం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు!  


 ఆరు అంతస్తుల భవనంలో ఎన్నో ప్రత్యేకతలు!


హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన తెలంగాణ కొత్త సచివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు. 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొత్త పరిపాలనా సౌధం కొలువుదీరింది. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న భవనం ఇది. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలిలో తీర్చిదిద్దారు. ఆరు అంతస్తులుగా నిర్మితమైన ఈ భవనంలో ఎన్నో ప్రత్యేకతలు! ప్రవేశ ద్వారాలు మొదలుకొని.. ముఖ్యమంత్రి కొలువుదీరే ఆరో అంతస్తు వరకు అడుగడుగునా ఆధునిక సౌకర్యాలు, అంతర్గత సౌందర్యాలు! అన్నింటిట కలబోతగా దీన్ని నిర్మించారు. భవనం ఎత్తు 265 అడుగులు. 650 మంది సిబ్బందితో సచివాలయానికి నిరంతరం పహారా కాస్తుంటారు. నీటి సరఫరా, వాననీటి సంరక్షణ.. ఇలా పలు అంశాల్లో నూతన ప్రాంగణంలో దేనికదే ప్రత్యేకం. 


మహా గంభీరంగా నాలుగు తలుపులతో ప్రధానద్వారం


సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తోందో అంతకు దీటుగా మహాద్వారం చూపరులను ఆకట్టుకునేలా రూపొందించారు. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తుంటుంది. ఈ దర్వాజకు నాలుగు తలుపులుంటాయి. ఆదిలాబాద్ అడవుల్లోని నాణ్యమైన టేకు కలపను సేకరించి, దాన్ని నాగపూర్ పంపి అక్కడ మహాద్వారాన్ని తయారు చేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయానికి 875కి పైగా తలుపులున్నాయి. అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు. సీఎం ఛాంబర్‌ తలుపుకు బాహుబలి డిజైన్ చెక్కారు. గాండ్రిస్తున్న సింహం నోట్లో కొక్కెం ఉండేలా ఇత్తడి పోత పోశారు. దాని చుట్టూ పూల డిజైన్లతో మహా గంభీరంగా ఉంది ద్వారం. ఇకపోతే, సచివాలయం నిర్మాణంలో 7 వేల టన్నుల ఉక్కు వాడారు. 35 వేల టన్నుల సిమెంటు అవసరమైంది. 26 వేల  టన్నుల ఇసుక కలిపారు. 60 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వినియోగించారు. 11 లక్షల ఇటుకలు  సచివాలయం భవనం కోసం వాడారు. 3 లక్షల చదరపు అడుగుల గ్రానైట్, లక్ష చదరపు అడుగుల మార్బుల్, 3,500 ఘనపు మీటర్ల ధోల్ పూర్ రెడ్ స్టోన్, 7,500 ఘనపుటడుగుల కలపను వినియోగించారు. 12 వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఈ మహాద్భుతం కళ్లముందు ఆవిష్కృతమైంది.


 34 గుమ్మటాలు సచివాలయానికి మణిమయ మకుటాలు


సచివాలయంలోకి ప్రవేశించగానే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే కళాకృతులు, పెయింటింగ్స్ అమర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొన్ని నమూనాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నాలు కొత్త సచివాలయానికి మణిమయ మకుటాల్లా నిలిచాయి. కింది నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించిన డోమ్స్.. ఆధునిక ఇంజినీరింగ్ కౌశలానికి నిదర్శనం. 165 అడుగుల ఎత్తున ప్రధాన డోమ్ నిర్మించటం నిర్మాణ రంగంలోనే అతిపెద్ద సవాల్ అని నిపుణులు అంటున్నారు. సచివాలయానికి ముందు, వెనుక చెరొక ప్రధాన గుమ్మటాన్ని నిలబెట్టారు. ఈ రెండింటిపైనా జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటి అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది. 2.5 టన్నుల బరువుండే ఈ సింహాల బొమ్మలను ఢిల్లీలో చేయించి తీసుకువచ్చి అమర్చారు. మరో 32  మూడు సింహాల చిహ్నాలు చిన్న డోమ్స్ భవనంపై కనిపిస్తాయి.