DGP Anjani Kumar: తెలంగాణాలో చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లా నుండి వర్షాలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ , ఇతర అధికారులంతా కలిసి డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షణ చేస్తున్న్లు వెల్లడించారు. మొత్తం 2900 మందిని రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మోచన్ పల్లిలో వరదల్లో చిక్కుకున్న వారిని 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. అలాగే అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకి రావాలని సూచించారు. అలాగే హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. ముసారాం బాగ్ బ్రిడ్జ్ పై వరద నీరు కూడా కంట్రోల్ లో ఉందని వివరించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సెల్ఫీ లు తీసుకోవడానికి వచ్చి చాలా మంది ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని డీజీపీ వెల్లడించారు. సెల్ఫీల కోసం జనాలు అస్సలే బయటకు రావొద్దని.. ముఖ్యంగా పిల్లలను తీసుకురావద్దని చెప్పారు. విద్యుత్ స్తంభాల దగ్గరకు అస్సలే వెళ్లకూడదని.. ఏవైనా విద్యుత్ తీగలు పడి ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. 24 గంటల పాటు డీజీపీ కార్యాలయంలోనే ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.