Cyclone Effect on Telangana: మోచా తుపాను ప్రభావం తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు వాతావరణ శాఖ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.


శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల ఈ నెల 8వ తేదీన అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో 9వ తేదీన వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం దాదాపు ఉత్తరం దిశగా పయనించి మధ్య బంగాళాఖాతం వైపు కదిలి తీవ్రతరం అవుతుందని, తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపానుకు మోచా అనే పేరు పెట్టారు.


అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నల్గొండలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ నెల 9 నుండి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


హైదరాబాద్ లో ఇలా


హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 81 శాతం నమోదైంది.


ఏపీ లో నేడు వాతావరణం ఇలా


నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 


కర్నూలు జిల్లా పశ్చిమ భాగాల్లో భారీ పిడుగులు, వర్షాలు మొదలయ్యాయి. ఇది మరో మూడు గంటల్లో మరిత పెరిగి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని వివిధ భాగాలకి విస్తరించనుంది. మూడు గంటల తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలకు అకకాశాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశాలు మే 8 రాత్రి బాగా కనిపిస్తుంది.


విజయవాడకి చాలా దగ్గరగా వర్షాలు వచ్చి బలహీన పడ్డాయి. నిన్నటి వర్షాలు తూర్పు నుంచి వచ్చాయి.. కానీ నేడు మాత్రం అవి మెల్లగా ఉత్తర వాయవ్య భాగం నుంచి రావడం వలన వర్షాలకి తగినంత బలం దక్కలేదు. ఒకటి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి ఇది వేసవి కాలం. ఈ కాలంలో వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అది కూడా చాలా వేగంగా బలపడుతుంది అలాగే చాలా వేగంగా బలహీనపడుతుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.