సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వాహనాల వేలం ద్వారా రూ.6.75 కోట్లు వచ్చాయన్నారు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను 13 విడతల్లో వేలం వేశామన్న ఆయన, మొత్తం 12వేల వాహనాలకు వేలం నిర్వహించామన్నారు. సుమారు 5,750 వాహనాలకు 3 సార్లు నోటీసులు జారీ చేశామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. త్వరలో వీటికి కూడా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 4,500లకు పైగా వాహనాలు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లలో ఉన్నాయని తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలను www.cyberabadpolice.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అభ్యంతరాలు ఉన్న వాహన యజమానులు...6నెలల కాల పరిమితిలోపు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలతో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
గతేడాది హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించారు. మొత్తంగా 600 వాహనాలను వేలంలో పెడితే, రూ. 51.74 ఆదాయం వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్అండ్ఓ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, గోషామహల్ స్టేడియంతో పాటు అనేక ఇతర కార్యాలయాల్లో వివిధ కేసులకు సంబంధించిన వాహనాలు ఉన్నాయి. తొలి విడతలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన 600 వాహనాలను.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ వేలానికి పెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి 550 మంది బిడ్డర్లు వేలానికి హాజరయ్యారు. నగరానికి చెందిన 568 ద్విచక్ర, త్రీ వీలర్స్, 2 కార్లు వేలంలో అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ. 51.74 ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. పత్రికా ప్రకటనల ద్వారా యజమానులకు తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతో.. వేలం నిర్వహించారు.