హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వేగం విషయంలో కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త వేగ పరిమితిని అత్యధికంగా 120 కిలో మీటర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం (జూలై 31) నోటిఫికేషన్ జారీ చేశారు. వేగ పరిమితిని తాజాగా 120 కిలో మీటర్లకు పెంచారు. గతంలో ఈ అత్యధిక వేగం పరిమితి 100 కిలో మీటర్లుగా ఉండేది. ఆ పరిమితి దాటి దూసుకెళ్లేవారిపై స్పీడ్ గన్ల సాయంతో జరిమానా వేసేవారు. ఇప్పటికైతే ఔటర్ రింగ్ రోడ్డు పైకి టూ వీలర్స్, నడిచి వెళ్లే వారికి అనుమతి లేని సంగతి తెలిసిందే. ఆ నిబంధనను అలాగే కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇలా ఉన్నాయి.
లేన్ 1 అండ్ 2 లో 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్‌తో వెళ్లొచ్చు. లేన్ 3 అండ్ 4 లో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఐదో లేన్ లో 40 కిలో మీటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది. 40 కిలో మీటర్ల స్పీడ్ కన్నా తక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్డు పైకి అనుమతి లేదు.
హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు సహా, నగరం మీదుగా మరో ప్రాంతానికి వెళ్లే వారికి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో కూడా దూర ప్రాంతానికి వెళ్లాల్సిన వారు కూడా ట్రాఫిక్ నుంచి తప్పించుకోడానికి వీలును బట్టి ఔటర్ రింగ్ రోడ్డును వాడుతుంటారు.
రోడ్డుపై గుంతలతో జనం విమర్శలు
మరోవైపు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ విషయంలోనూ ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. టోల్ ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు రోడ్లపై గుంతలు, ఇతర నిర్వహణ లోపాలు సరి చేయాలని చెబుతున్నారు. ఓఆర్ఆర్ పై పెద్ద సంఖ్యలో గుంతలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. వీటిలోనూ ముఖ్యంగా 3, 4 లేన్లలో ఎక్కువగా గుంతలు పడ్డాయని.. దీంతో భారీ వాహనాలు 1, 2 లేన్లలోకి వస్తుండడంతో ప్రమాదాలుజరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాకాలం కాబట్టి, గుంతలు ఏర్పడ్డాయని త్వరలోనే గుంతలు పూడుస్తామని అధికారులు చెబుతున్నారు.