Central Govt gazette notification to organize Hyderabad Liberation Day: హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంపై జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని సీపీఐ(ఎం) కోరుతోంది. సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవం జరపాలంటూ కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయటాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇలా చేస్తే, ఇది చరిత్రను వక్రీకరించడమే అవుతుందని తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నోటిఫికేషన్ జారీ చేయటం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన కమ్యూనిస్ట్ నేతలు  
పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి కమ్యూనిస్ట్ నేతలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపించారు. అయితే ఈ పోరాటంతో ఏ సంబంధం లేని వాళ్లు ఇది విమోచన దినం అంటున్నారంటూ మండిపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూమి కోసం, భుక్తి కోసం, జమీందారీ వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాటం జరిగిందన్నారు. ఈ పోరాటం కాలంలో, స్వాతంత్య్ర సమయంలో బ్రిటిష్‌ పాలకులతో జరిగిన ఒప్పందం మేరకు జవహర్‌లాల్ నెహ్రూ- సర్దార్ వల్లభాయ్ పటేల్‌ ప్రభుత్వం, నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతథ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేయలేని సమయంలో  నిజాం రాజు చేతులెత్తేస్తుంటే కేంద్ర ప్రభుత్వ సైన్యాలు ప్రవేశించాయి. దాంతో నిజాం రాజు ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయాడని ఓ ప్రకటనలో సీపీఎం పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేస్తూ సెప్టెంబర్‌ 17న సంతకం చేశారు కనుక, అది విలీనమైన రోజు అని విమోచన దినోత్సవం కాదన్నారు. 


 ‘మరోవైపు కేంద్ర సైన్యం రజాకార్‌ నాయకుడు కాశిం రజ్వీని అరెస్టు చేసి మరణశిక్ష విధిస్తారని రైతాంగం ఆశించింది. కానీ రజ్వీని పాకిస్తాన్‌కు పంపించారు. 7వ నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను కూడా అరెస్టు చేయలేదు. పైగా ఆనాటి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ పోరాడుతున్న తెలంగాణ నెత్తిన 7వ నిజాం రాజునే పేరు మార్చి రాజప్రముఖ్‌గా నియమించారు. రాజుతో చేతులు కలిపిన భారత సైన్యం రైతాంగం మీద హత్యాకాండ జరిపింది. భయంకరమైన అణచివేత సాగించారు. ఈ వాస్తవాల నుంచి కొత్తతరం ప్రజలకు తెలియకుండా వారిని పక్కదోవ పట్టిస్తూ, ఆనాటి పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీపీఐ(ఎం) కోరుతున్నది’ అని CPI(M) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు.


సెప్టెంబర్‌ 17 అధికారిక కార్యక్రమాలు నిర్వహించేలా గెజిట్ 
కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదానికి కారణమవుతున్న సెప్టెంబర్‌ 17ను అధికారికం చేసింది. ఆ రోజును "హైదరాబాద్‌ లిబరేషన్ డే"గా నిర్వహించాలని గెజిట్‌ జారీ చేసింది.