బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించే ఉద్దేశంతో ఏరికోరి బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం యాదమ్మ అనే సామాన్య మహిళకు ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వంటల్లో చేయి తిరిగిన ఆమె 10 వేల మందికి సైతం సునాయసంగా రుచికరంగా వండిపెట్టగల నేర్పరి. కానీ మోదీకి, మిగతా బీజేపీ అతిథులకు వంటలు చేయాల్సిన బాధ్యతను బండి సంజయ్ యాదమ్మకు అప్పగించారు. అయితే, నోవాటెల్ హోటల్‌లో యాదమ్మకు అవమానం జరిగిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. నోవాటెల్ హోటల్‌లోని దిగ్గజ చెఫ్‌లు, ఇంకొంతమంది యాదమ్మను లోనికి రానివ్వలేదని విమర్శలు వచ్చాయి.
వంట మనిషి యాదమ్మను, ఆమె బృందానికి పాస్‌లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారని నెట్టింట్లో ప్రచారం జరిగింది. పాస్‌లు ఉంటేనే హోటల్‌లోకి అనుమతి ఉంటుందని పోలీసులు కూడా స్పష్టం చేయడంతో యాదమ్మ బృందం రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ అంశంపై స్వయంగా యాదమ్మ క్లారిటీ ఇచ్చారు. నోవాటెల్ ప్రాంగణం లోపలికి తనను రానివ్వలేదంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని యాదమ్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వద్దకు రాగానే బండి సంజయ్ కారు పంపించి హోటల్‌లోకి తీసుకెళ్లారని, తనను తల్లిలాగా అందరూ చూసుకున్నారని చెప్పారు. తాను హోటల్ వరకు రాగానే కొందరు యువకులు తనను కింద కూర్చోమని చెప్పి ఫొటోలు తీసి దుష్ప్రచారం చేశారని, ఆ సమయంలో వారు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదని చెప్పారు. అందుకే తాను కింద కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఆమెనే ఎందుకు?
కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ అనే మహిళ గత మూడు దశాబ్దాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్నారు. ఈమె సొంతూరు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. ఈమెకు 15 ఏళ్లప్పుడే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం అయింది. దీంతో కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. అప్పటి నుంచి వంటలు చేయడమే జీవనాధారంగా వీరి కుటుంబం ఉంటోంది.
ఈమె చేసే శాకాహార వంటకాలు జిల్లాలో బాగా ఫేమస్ అయ్యాయి. ఏకంగా 10 వేల మందికి సైతం సులువుగా చాలా రుచికరంగా వండి పెట్టేయగల నేర్పరిగా యాదమ్మ పేరు తెచ్చుకున్నారు. గతంలో కరీంనగర్ లో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కార్యక్రమాలతో పాటు బండి సంజయ్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా ఈమెనే వంటలు చేసి పెట్టేది. ఆమె చేతి తెలంగాణ రుచులను తిన్న వారి ద్వారా ప్రశంసలు దక్కాయి. అలా మంచి గుర్తింపు వచ్చింది.