Secunderabad Fire Accidents: సికింద్రాబాద్ పరిధిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. గురువారం స్వప్నలోక్ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడంతో అసలు అగ్ని ప్రమాదాలకు కారణాలపై చర్చ సాగుతోంది. అగ్నిప్రమాదాలు జరిగిన అన్ని చోట్లా అక్రమ గోదాములే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. డెక్కన్ మాల్ ఘటన తర్వాత అగ్ని ప్రమాదాల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు.
ముందు జాగ్రత్తలేవీ..?
బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతికి కారణం గోడౌనే.. సెప్టెంబర్‌లో రూబీ లాడ్జిలో ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందగా.. బ్యాటరీ గోదామే కారణమైంది. డెక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంటల్లో ముగ్గురు సజీవ దహనానికి కారణం గోడౌనే. ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నికీలలు చెలరేగడానికి కారణమూ గోదామే. ఫైర్‌సేఫ్టీ మచ్చుకైనాలేని చోట ప్రాణాలను మింగేస్తున్న గోడౌన్లు. కమర్షియల్ కాంప్లెక్సుల్లోనూ గోదాముల నిర్వహణతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలే తప్ప.. పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చొరవ చూపడంలేదు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర పరిస్థితుల్లో వ్యాపారాలు సాగుతున్నా.. కఠినంగా వ్యవహరించటంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
తూతూమంత్రం చర్యలే..!
గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దిశగా చర్యలు తీసుకోలేదు. వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లోనైనా చర్యలు శూన్యం. అనుమతి లేని అంతస్తులు, గృహ అవసరాల కోసం నిర్మించిన ఇళ్లు భారీగా వ్యాపార సముదాయాలుగా మారడం, రోడ్ల ఆక్రమణ జరుగుతున్నా బల్దియా అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. స్థానికంగా కొందరు కిందిస్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు అందుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదం జరిగాక హడావుడి చేయడం కన్నా.. ముందే అప్రమత్తమైతే ప్రాణాలతో పాటు ఆస్తినష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.