CWC Meeting in Hyderabad: వ్యక్తిగత ప్రయోజనాలను, విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ విజయం కోసం ప్రధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నేతలను ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. అదే విధంగా సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఎదుటి పార్టీలను ఓడించగలమని స్పష్టం చేశారు. దేశ ప్రజలు అంతా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయాలే దీనికి స్పష్టమైన రుజువు అని తెలిపారు. 


'విశ్రాంతి తీసుకుమే సమయం కాదు'


ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదని, గత 10 సంవత్సరాల్లో బీజేపీ పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయని ఖర్గే పేర్కొన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని మోదీ విఫలం అయ్యారని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఏకమై ఈ నియంతృత్వ ప్రభుత్వానికి తెరదించాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి శతాబ్ది కాలం పూర్తి అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించడమే మహాత్ముడికి సరైన నివాళి అని పేర్కొన్నారు.


మున్ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్న మల్లికార్జున ఖర్గే.. అవి కేవలం పార్టీకే పరిమితం కావని అన్నారు. భారత ప్రజాస్వామ్య మనుగడ, రాజ్యాంగ పరిరక్షణకూ సంబంధించినవి అని చెప్పారు. త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు 6 నెలల సమయంలో మాత్రమే ఉందని ఖర్గే గుర్తు చేశారు. జమ్మూ- కశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుతక్వాలు సామాజిక న్యాయం, సంక్షేమం విషయంలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టాయని తెలిపారు. 


అక్కడి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఖర్గే సూచించారు. సరికొత్త బలం, స్పష్టమైన సందేశంతో తెలంగాణ నుంచి ముందుకు వెళ్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా రాబోయే అన్ని ఎన్నికల్లో గెలవాలని, బీజేపీ దుష్టపాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలనే దృఢ నిబద్ధతతో హైదరాబాద్ నుంచి బయల్దేరతామని అన్నారు. 


తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ వినతి..


రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక వినతి చేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని తెలంగాణ ప్రజలకు CWC విజ్ఞప్తి చేసింది. బంగారు తెలంగాణ కలను సాకారం చేసి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును అందించాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్రను సీడబ్ల్యూసీ గుర్తుచేసుకుంది. ఆనాటి రాజకీయ పరిస్థితులను, ఎత్తుపల్లాలను పక్కన పెట్టి సైతం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర సాధనను సాధ్యం చేశారన్నారు. తొమ్మిదినరేళ్లు గడుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను ఈ విషయంపై మోసం చేస్తూనే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొంది.