కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని, మధ్యలో కొంత వెనుకబడ్డ ఇప్పుడు పుంజు కుంటుందన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింత మోహన్. 50 ఏళ్ల తరవాత ఒక దళిత నేతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నామని చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని, కొన్ని కార్పోరేట్ శక్తులు దీన్ని అడ్డుకుంటున్నాయని చెప్పారు. శశిథరూర్ దళిత వ్యతిరేకి అని, ఆయనకు ఒక్క ఓటే వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కార్పొరేట్లు ఖర్గేను వ్యతిరేకిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు.
బీజేపీ వైపు నుండి హైద్రాబాద్ లో శశిథరూర్ పర్యటిస్తున్నారని మీడియా అడగగా, ఆయన ఎవరో తనకు తెలీదంటూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లిఖార్జున ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఖర్గే వివాద రహితుడు అని, శశిథరూర్ పోటీ చేయావచ్చు. కానీ ఆయనకు ఒక్క ఓటే వస్తుందని జోస్యం చెప్పారు. శశిథరూర్ దళిత వ్యతిరేక వ్యక్తి అని, ఆయనకి కాంగ్రెస్ గురించి ఏమి తెలీదని వ్యాఖ్యానించారు. 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతంగా జరుగుతుందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి వంద లోపు సీట్లు వస్తాయన్నారు.
గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందిస్తాం
దేశంలో ఇంకా కోట్ల మంది ఆహారం కోసం ఎదురుచూస్తున్నారని, 60 కోట్ల మంది ఆకలితోనే నిద్ర పోతున్నారని చెప్పారు. మోదీ ఎన్నో ఘనతలు సాధించారని.. అందులో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సెప్టెంబర్ 17న దేశానికి 8 చిరుత పులులు తీసుకురావడం ఒకటన్నారు. తమ చుట్టూ 30 ఏళ్లుగా తిరుగుతున్న అదానీని ప్రపంచ కుబేరుడిగా చేయడం తప్ప మోదీ చేసిన ఘనత ఏమీ లేదన్నారు. ప్రజల ఆకలి తీర్చలేని ప్రధాని ఉంటే ఏంటి, లేకపోతే ఏమీ వ్యత్యాసం లేదన్నారు. రూ.300 ఉన్న ఎల్పీజీ ధర.. ప్రధాని మోదీ హయాంలో సిలిండర్ ధర రూ.1100 దాటి పోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము రూ.500కు అందిస్తామన్నారు.
రూ.3 లక్షల వరకు రైతు రుణాల మాఫీ
రైతుల కష్టాల గురించి ఆలోచించలేని వ్యక్తి దేశానికి ప్రధానిగా అవసరమా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రూ.3 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. పెట్రోల్ ధర రూ.150 వైపు పరుగులు తీస్తుందని, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరలను భారీగా తగ్గించి తీరుతామని చెప్పారు. అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, సెక్యూలర్ పార్టీలన్ని కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. యూపీఏ 2004లో అన్ని సెక్యూలర్ పార్టీలను కాంగ్రెస్ కలుపుకుని వెళ్లిందన్నారు.
ప్రతి పార్టీలోనూ అంతర్గత విభేదాలు సహజం
మహాత్మా గాంధీ ఉన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూను సర్ధార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. ఇందిరా గాంధీ పీఎంగా ఉన్నప్పుడు సైతం మొరార్జీ దేశాయ్, నీలం సంజీవరెడ్డి లాంటి నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. రాజీవ్ గాంధీ హాయంలోనూ వీపీ సింగ్, వరుణ్ నెహ్రూలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని, తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతల్లో విభేదాలున్నాయిని, ఇన్నర్ డెమొక్రసీ ఉందన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు మేం కలసికట్టుగా పోరాటి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామన్నారు. ప్రధాని మోదీ అంటే రాజ్ నాథ్ సింగ్‌కు, నితిన్ గడ్కరీకి పడదన్నారు. బీజేపీలోనూ అంతర్గత విభేదాలున్నాయని, తాను తలుచుకుంటే 250 మంది లోక్ సభ సభ్యులను బయటకు తీసుకుని వెళ్తానని నితిన్ గడ్కరీ కామెంట్లు చేయగా ఆయన పార్లమెంటరీ బోర్డు నుంచి తీసేశారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.