Mallu Ravi Resign: కాంగ్రెస్ కీలక నేత మల్లురవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఓ పదవిలో నియమించగా.. దానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిలో కొద్ది రోజుల క్రితం మల్లు రవి నియమితులు అయ్యారు. తాజాగా ఆ పదవికి రాజీనామా చేసినట్లు మల్లు రవి వెల్లడించారు. రేవంత్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని పంపినట్లు చెప్పారు. అయితే, దానిని ఆమోదిస్తారా? లేక ఆమోదించరా అనేది ఆయన ఇష్టమని అన్నారు. తాను నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నానని.. అందుకోసం ఈ పదవి అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేశానని మల్లు రవి చెప్పారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం రెండు పదవులు ఉండవద్దని.. అందుకే తన ప్రస్తుత పదవికి రాజీనామా చేశానని అన్నారు.
నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసమే తాను జడ్చర్ల అసెంబ్లీ టికెట్ వదులుకున్నానని అన్నారు. ఏ సర్వేలు చేసినా నాగర్ కర్నూల్ ఎంపీగా తానే గెలుస్తానని అన్నారు. ఒకవేళ నాగర్ కర్నూల్ టికెట్ తనకు అధిష్ఠానం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతు తనకు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయిరెడ్డి ఎంపీగా.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారని మల్లు రవి గుర్తు చేశారు.